పల్లెల్లోనే ఓటరు నమోదుకు ప్రజల మొగ్గు
● ఎన్యూమరేషన్ ఫారాలు అప్పగిస్తున్న జనం
● సర్ ప్రక్రియలో ఒకటి కంటే ఎక్కువ ఉన్న ఓట్లకు చెక్
● ఓటరు జాబితా నుంచి తొలగింపు దిశగా చర్యలు
అచ్చంపేట: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియ ఉమ్మడి జిల్లాలో వేగంగా సాగుతోంది. గ్రామాల్లో బీఎల్‌ఓలు ప్రతి ఇంటిని జల్లెడ పడుతూ, ఓటర్ల వివరాలను ధ్రువీకరిస్తుండగా.. సూపర్‌వైజర్లు, రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులు, సిబ్బంది సమన్వయంతో డిజిటలైజేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. అయితే ఉన్నత విద్య, ఉద్యోగాలు, జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారిలో ఎక్కువ మంది పుట్టిన ఊరిలో ఓటు ఉంచుకునేందుకే మక్కువ చూపుతున్నారు. స్వయంగా స్వగ్రామానికి వచ్చి ఎన్యూమరేషన్ ఫారాలు నింపి బీఎల్‌ఓలకు అందిస్తున్నారు.
అసలైన ఓటర్లు 75 – 85 శాతమే..
ఉమ్మడి జిల్లాలోని పట్టణాలు, గ్రామాల్లో అసలైన ఓటర్లు 75 నుంచి 85శాతం మాత్రమే మిగలనున్నారు. మిగతా ఓటర్లు మరణించిన వారు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినవారు, మరికొందరు ఒకటి కంటే ఎక్కువ ఓట్లు కలిగి ఉన్నట్లు లెక్కలు తేలుతున్నాయి. అయితే ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బీఎల్‌ఓలకు ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫారాలన్నింటిని వందశాతం డిజిటలైజేషన్ చేయాల్సి ఉంది. ఇందులో అసలైన ఓటర్లను గుర్తిస్తూనే.. మిగిలిన వారిని నాలుగు కేటగిరీల్లో నమోదు చేయాలి. బీఎల్‌ఓల విచారణలో ఓటరు మరణించినట్లు తేలితే మృతుల కేటగిరీలో, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతే పర్మినెంట్‌గా షిఫ్ట్ అయినట్లుగా, ఒకే వ్యక్తి రెండు చోట్ల ఓటరుగా నమోదైతే సదరు ఓటరు ఎంపిక చేసుకున్న చోట జాబితాలో ఉంచి.. రెండో దాని డూప్లికెట్‌గా, ఫారాలు తీసుకోని వారు, తిరిగి ఇవ్వని వారి పేర్లను ఇతర కేటగిరీలో చేరుస్తున్నారు. ఇలా నమోదైన వారి పేర్లను ముసాయిదా జాబితా నుంచి తొలగించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
వందశాతం పూర్తికి..
క్షేత్రస్థాయిలో బీఎల్‌ఓలకు ఓటర్ల నుంచి ఎన్యూమరేషన్ ఫారాలు పూర్తిస్థాయిలో అందక డిజిటలైజేషన్ ప్రక్రియ ఆలస్యమవుతోంది. ఒకవైపు గడువులోగా డిజిటలైషన్ ప్రక్రియ వందశాతం పూర్తి చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుండటం.. మరోవైపు టెక్నికల్ అధికారుల నుంచి పూర్తి సహకారం అందకపోవడంతో బీఎల్‌ఓలు తలలు పట్టుకుంటున్నారు. ఆన్‌లైన్‌లో డిజిటలైజేషన్ చేసుకున్న వారు సైతం ఎన్యూమరేషన్ ఫారాలు అందజేయాల్సి ఉండగా.. చాలామంది ఇవ్వడం లేదని బీఎల్‌ఓలు పేర్కొంటున్నారు. ఎన్యూమరేషన్ ఫారం డిజిటలైషన్ ప్రక్రియ పూర్తి చేస్తుండగా.. సాంకేతిక సమస్యతో ‘నో మ్యాపింగ్’ అని వస్తుండటంతో మరోసారి సరిచేయాల్సి రావడం తలనొప్పిగా మారింది. ఇంకా ఓటర్ల నుంచి 10 నుంచి 15 శాతం ఎన్యూమరేషన్ ఫారాలు అందాల్సి ఉందని చెబుతున్నారు.
పట్టణాల్లో మందకొడిగా..
సర్ డిజిటలైజేషన్ ప్రక్రియ గ్రామాల్లో జోరుగా.. పట్టణాల్లో మందకొడిగా సాగుతోంది. కొందరు ఓటర్లు ఎన్యూమరేషన్ పత్రాలు తిరిగి ఇవ్వడంలో జాప్యం చేస్తుండటంతో అధికారులు పాట్లు పడుతున్నారు. ఓటర్లకు స్వయం ఫోన్‌చేసి అడుగుతున్నా అప్పుడు, ఇప్పుడు అని అంటున్నారని బీఎల్‌ఓలు వాపోతున్నారు.
ఉమ్మడి జిల్లాలో ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ఇలా..
జిల్లా మొత్తం ఓటర్లు డిజిటలైజేషన్ ఫారాలు శాతం
రానివి
మహబూబ్‌నగర్ 7,32,488 5,93,167 55,743 86.12
నాగర్‌కర్నూల్ 7,31,632 5,80,793 56,482 79.38
వనపర్తి 2,75,570 2,18,488 16,515 79.29
జోగుళాంబ గద్వాల 5,03,859 4,19,973 43,961 83.32
నారాయణపేట 4,95,574 3,93,911 45,959 79.49


