పాలకవర్గానికి పట్టింపేది? | - | Sakshi
Sakshi News home page

పాలకవర్గానికి పట్టింపేది?

Jul 27 2026 12:48 AM | Updated on Jul 27 2026 12:48 AM

నేడు వనపర్తి పుర కౌన్సిల్‌ సమావేశం

కమిషనర్‌ లేకపోవడంతోనే..

నేడు వనపర్తి పుర కౌన్సిల్‌ సమావేశం

వనపర్తిటౌన్‌: పుర ఎన్నికలు జరిగి ఏడు నెలలు.. పాలకవర్గం కొలువుదీరి ఆరు నెలలు పూర్తయినా ఇప్పటి వరకు కేవలం రెండు సాధారణ కౌన్సిల్‌ సమావేశాలు మాత్రమే నిర్వహించడంపై పుర ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. అభివృద్ధి, ప్రజా సమస్యలపై చర్చించాల్సిన కౌన్సిల్‌ సమావేశాలు నిర్వహించడంలో నిర్లక్ష్యం కనిపిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల లోలోపల ఒక సభ నిర్వహించినట్లు చెబుతున్నా.. అందుకు సంబంధించి ఎలాంటి ప్రకటన కూడా పుర కార్యాలయం నుంచి విడుదల కాకపోవడం గమనార్హం. రహస్యంగా కౌన్సిలర్లతో సంతకాలు తీసుకొని సమావేశం నిర్వహించే ముందు, తర్వాత ఎలాంటి ప్రకటన లేకుండా ముగిసినట్లు చెప్పుకోవడం పాలక మండలి నిర్లక్ష్యానికి అద్ధం పడుతోంది. దీనిపై ప్రతిపక్ష, అధికార పార్టీ కౌన్సిలర్లు బాహాటంగానే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమావేశాల నిర్వహణ గాలికొదిలేయడంతో పుర పాలనలో పారదర్శకత లోపించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం నెలకొకసారి కౌన్సిల్‌ సమావేశం నిర్వహించాల్సి ఉండగా.. మార్చిలో బడ్జెట్‌ మీటింగ్‌, మే నెలలో సాధారణ సమావేశం నిర్వహించి చేతులు దులుపుకొన్నారు. నిబంధనల ప్రకారం మూడు నెలల పాటు సమావేశం జరపకపోతే పాలకమండలిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. సమావేశాలు జరిగితేనే చైర్‌పర్సన్‌కు రూ.15,600, వైస్‌ చైర్మన్‌కు రూ.6,900, కౌన్సిలర్లకు రూ.3,250 చొప్పున గౌరవ వేతనం తీసుకోవాలి. సమావేశాలు నిర్వహించకుంటే గౌరవ వేతనం తీసుకునే అవకాశం ఉండదని సీనియర్‌ కౌన్సిలర్లు, అధికారులు పేర్కొంటున్నారు.

అభివృద్ధిపై ప్రభావం..

పట్టణాభివృద్ధిలో భాగంగా వార్డుల్లో తాగునీరు, పారిశుద్ధ్యం, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పైప్‌లైన్‌ల లీకేజీల మరమ్మతు తదితర అంశాలను ప్రతి నెల కౌన్సిల్‌లో ఆమోదించాల్సి ఉంటుంది. చైర్‌పర్సన్‌ అధ్యక్షతన సభ నిర్వహించాలి. చైర్‌పర్సన్‌ అందుబాటులో లేకపోతే వైస్‌ చైర్మన్‌ కూడా సభ నడపొచ్చు. ఒకవేళ ఆయన కూడా అందుబాటులో లేకపోతే ఎవరైన ఒక కౌన్సిలర్‌ కౌన్సిల్‌ను కొనసాగించొచ్చు. సభలో 1/3 మెజార్టీ సభ్యులు ఉంటే కౌన్సిల్‌ నిర్వహణకు అర్హత ఉంటుంది. కానీ పాలక పెద్దలు తాము అనుకుప్పుడే సభలు జరగాలనే ధోరణితోనే ప్రతి నెల నిర్వహించడం లేదని అధికారపార్టీ సభ్యులు వాపోతున్నారు.

కో–ఆప్షన్‌ ఊసే లేదు..

పుర ఎన్నికలు జరిగి 7 నెలలు గడుస్తున్నా.. కో–ఆప్షన్‌ ఎన్నిక ఉంటుందా? ఉండదా అనేది అధికారపార్టీ ఆశావహుల్లో అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన వారు, రాజకీయ పరిణామాల నేపథ్యంలో హామీ పొందిన ఆశావహులు ఎదురుచూస్తున్న ఎన్నిక జరగడం లేదు. పెబ్బేరు, వనపర్తి మున్సిపాలిటీలో 20మందికి పైగా దర ఖాస్తు చేసుకున్నా.. ఇప్పటి వరకు ఆ ఊసే లేదు. గతంలో రెండునెలల్లోపే ఈ ప్రక్రియ ముగిసేది.

చైర్‌పర్సన్‌ మౌనం వీడేనా..?

ఇప్పటి వరకు జరిగిన రెండు సాధారణ సమావేశాల్లో చైర్‌పర్సన్‌ పట్టణ ఎజెండా అంశాల, కౌన్సిలర్లు లేవనెత్తుతున్న అభ్యంతరాలు, సమస్యలపై చైర్‌పర్సన్‌ మౌనంగానే ఉంటున్నారు. ఈ మౌనం అధికార పార్టీ సభ్యుల్లో చర్చకు దారితీస్తుంది. ఈ విషయమై చైర్‌పర్సన్‌తో ప్రస్తావించేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా ఆమె అందుబాటులోకి రాలేదు.

వనపర్తి పురపాలిక

ఏడు నెలల్లో కేవలం రెండుసార్లే

నిర్వహణ

కో–ఆప్షన్‌ ఎన్నికపై వీడని సందిగ్ధం

ఈ సమావేశంలోనైనా చైర్‌పర్సన్‌ గళం విప్పేనా?

పుర కమిషనర్‌ లేకపోవడంతోనే సమావేశాలు నిర్వహించలేదు. ఒక్క జూన్‌లోనే ఇద్దరు కమిషనర్లు మారడంతో సమావేశం నిర్వహించేందుకు వీలు కాలేదు. కమిషనర్‌ లేకుండా సభ నిర్వహించడం సాధ్యం కాదు. మున్సిపాలిటీలోని పలు విభాగాల్లో అధ్యాయనం చేసేందుకు ఎమ్మెల్యే సూచించిన కమిటీలను త్వరలోనే వేస్తాం.

– మధుసూదన్‌ గౌడ్‌,

వైస్‌ చైర్మన్‌, వనపర్తి పురపాలిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement