అర్హుల పేర్లు ఓటరు జాబితాలో ఉండాలి | - | Sakshi
Sakshi News home page

అర్హుల పేర్లు ఓటరు జాబితాలో ఉండాలి

Jul 27 2026 12:48 AM | Updated on Jul 27 2026 12:48 AM

వనపర్తిటౌన్‌: ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)లో భాగంగా నిర్వహిస్తున్న ఎన్యూమరేషన్‌ ఫారాల డిజిటలైజేషన్‌ సమర్థవంతంగా నిర్వహించి అర్హులైన ఓటర్లు తుది జాబితాలో కచ్చితంగా ఉండేలా చూడాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కోరారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని 9వ వార్డులో సర్‌ ప్రక్రియను పరిశీలించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు కీలకమని, మృతిచెందిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించడంతో పాటు దొంగ ఓట్లకు తావివ్వొద్దన్నారు. అదేవిధంగా బీఎల్వోలు, బీఎల్‌ఏలకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట బీఆర్‌ఎస్‌ నాయకులు దేవర్ల నర్సింహ, డేగ మహేశ్వర్‌రెడ్డి, చిట్యాల రాము, శ్రీనివాసులు, బేదడి కుమార్‌, గోవర్ధన్‌ సాగర్‌, కిరణ్‌కుమార్‌, నాగేంద్రం, నాగనమోని రవి, బీఎల్వోలు అనురాధ, నాగలక్ష్మి ఉన్నారు.

సాగునీరు వదలాలి..

వనపర్తి రూరల్‌: రాజకీయాలు పక్కనబెట్టి రైతులను ఆదుకునేందుకు వెంటనే కన్నెపల్లి, పాలమూరు–రంగారెడ్డితో పాటు అన్ని ఎత్తిపోతల పథకాల మోటార్లను ప్రారంభించి సాగునీరు విడుదల చేయాలని మాజి మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి చంద్రబాబుకు తాబేదారుగా మారారని.. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సమైఖ్యవాది, ఆయనకు తెలంగాణ ప్రయోజనాలు పట్టవని ఎద్దేవా చేశారు. సాగునీటిశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి తెలంగాణ ప్రజల ఆకలి, ఆకాంక్షల మీద సోయి లేదని పేర్కొన్నారు. ఎల్‌నినో నేపథ్యంలో ఎగువ నుంచి వస్తున్న వరద నీటిని ఒడిసిపట్టడాన్ని సర్కారు మరిచిందని తెలిపారు. కుంటిసాకులతో పంటలను ఎండబెడితే అన్నదాతలు కన్నెర్ర చేయడం ఖాయమని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే మోటార్లు ప్రారంభించి ఎత్తిపోతల పథకాల కింద ఉన్న చెరువులు, కుంటలు నీటితో నింపాలని డిమాండ్‌ చేశారు.

‘పీఆర్సీ వెంటనే

ప్రకటించాలి’

వనపర్తిటౌన్‌: అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో పీఆర్సీ ప్రకటిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని కాంగ్రెస్‌పార్టీ మరిచిందని టీఎస్‌ యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు ఎస్‌.రవిప్రసాద్‌గౌడ్‌, ప్రధాన కార్యదర్శి డి.కృష్ణయ్య ఆరోపించారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని ఊర్దూ మీడియం హైస్కూల్‌లో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశానికి వారు హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా.. నేటికీ పీఆర్సీ ప్రకటించడం లేదని, ఇకపై తాత్సారం చేస్తే పోరాటాలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే ఆరు విడతల డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని.. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం లాగే ఓబీఎస్‌ అమలు చేయాలన్నారు. ఉపాధ్యాయుల కొరత వేధిస్తోందని, ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్‌ కార్డుల్లో ఎన్నో లోపాలున్నాయని తెలిపారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు వెంటనే చేపట్టాలన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బి.వెంకటేష్‌, కె.జ్యోతి, జిల్లా కోశాధికారి తిమ్మప్ప, జిల్లా కార్యదర్శులు పి.శ్రీనివాస్‌ గౌడ్‌, ఎండీ హమీద్‌, జి.మురళి, లక్ష్మణ్‌ నాయక్‌, బి.అరుణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement