కేంద్ర ప్రభుత్వంపై యువత విజయం : సీపీఎం | - | Sakshi
Sakshi News home page

కేంద్ర ప్రభుత్వంపై యువత విజయం : సీపీఎం

Jul 27 2026 12:48 AM | Updated on Jul 27 2026 12:48 AM

అమరచింత: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టే యత్నంలో భాగంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాపై యువత విజయం హర్షనీయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. ఆదివారం పట్టణంలోని జీఎస్‌ భవనంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నీట్‌ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై దేశ రాజధానిలో యువత చేసిన ఆందోళన చివరకు విద్యాశాఖ మంత్రి రాజీనామాకు దారితీసిందన్నారు. ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా అనేది కేవలం మొదటి అడుగు మాత్రమేనని.. ఇప్పుడు ఎన్‌టీఏను రద్దు చేయాలని కోరారు. విద్యార్థి వ్యతిరేక, వాణిజ్యపరమైన, మతతత్వ ధోరణి కలిగిన ఎన్‌ఈపీ –2020 కూడా వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. నిరసనకారులపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని, విద్యార్థులపై అమానుషంగా దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. పోరాట మార్గంలో అన్నిరకాల బెదిరింపులను ధైర్యంగా ఎదుర్కొని దృఢంగా నిలిచిన విద్యార్థి సంఘాలకు అభినందనలు తెలిపారు. క్రీడలు, కళలు, సినిమా, సంస్కృతి తదితర రంగాలకు చెందిన ప్రముఖులు ఈ ఉద్యమానికి మద్దతుగా నిలవడం సంతోషకరమన్నారు. ఐక్య పోరాటాలు విజయాన్ని సాధిస్తాయని చెప్పడానికి ఇదో ఉదహారణ అన్నారు. డిమాండ్లన్నీ నెరవేరే వరకు యువత ధృడంగా ఉంటూ పోరాటాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీపీఎం జిల్లాకార్యదర్శి పుట్టా ఆంజనేయులు, కార్యదర్శివర్గ సభ్యులు జబ్బార్‌, సీనియర్‌ నాయకులు మహమూద్‌, మండల కార్యదర్శి జీఎస్‌ గోపి, వెంకటేష్‌, అజయ్‌, రాఘవేంద్ర పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement