ఆయుధ వినియోగంలో నైపుణ్యాలు ఉండాలి | - | Sakshi
Sakshi News home page

ఆయుధ వినియోగంలో నైపుణ్యాలు ఉండాలి

Jul 26 2026 7:48 AM | Updated on Jul 26 2026 7:48 AM

వనపర్తి: పోలీసు అధికారులు, సిబ్బందికి ఆయుధాల వినియోగంపై సంపూర్ణ అవగాహన, నైపుణ్యం అవసరమని ఎస్పీ సునీతారెడ్డి అన్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం ఎరవ్రల్లి 10వ తెలంగాణ స్పెషల్‌ పోలీస్‌ బెటాలియన్‌లో జిల్లా పోలీసు అధికారులు, సిబ్బందికి నిర్వహించిన రెండ్రోజుల వార్షిక ఫైరింగ్‌ ప్రాక్టీస్‌ శనివారం ముగిసింది. చివరిరోజు ఎస్పీ పాల్గొని అదనపు ఎస్పీ, పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి ఫైరింగ్‌ నిర్వహించి తమ నైపుణ్యాన్ని పరీక్షించుకున్నారు. శిక్షణలో భాగంగా విధుల్లో వినియోగించే ఆయుధాలతో ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది పది రౌండ్ల ఫైరింగ్‌ చేసే అవకాశం కల్పించారు. ఫైరింగ్‌లో ప్రతిభ కనబర్చిన అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది తమ వద్ద ఉన్న ఆయుధాల పనితీరు, వినియోగ విధానంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ సక్రమంగా ఉంచాలన్నారు. విధి నిర్వహణలో శారీరక దృఢత్వం ఎంతో కీలకమని, రోజు వ్యాయామం జీవితంలో భాగంగా మార్చుకోవాలని సూచించారు. ఆరోగ్యం, మానసిక స్థైర్యం, అప్రమత్తతతో పనిచేస్తేనే ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించగలమన్నారు. చెడు వ్యసనాలు, చెడు స్నేహాలకు పూర్తిగా దూరంగా ఉండాలని, పోలీసుశాఖ గౌరవానికి భంగం కలిగించే చర్యలకు పాల్పడకూడదని కోరారు. వ్యక్తిగత, కుటుంబ, విధి నిర్వహణ, ఆరోగ్య సంబంధిత సమస్యలుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని, సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసానిచ్చారు. అలాగే ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏఆర్‌ అదనపు ఎస్పీ వీరారెడ్డి, రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ అప్పలనాయుడు, రిజర్వ్‌ సబ్‌ ఇనన్‌స్పెక్టర్‌ వినోద్‌, జిల్లా పోలీసు అధికారులు, ఎస్‌ఐలు, ఏఆర్‌ సిబ్బంది పాల్గొన్నారు.

ఫైరింగ్‌ ప్రాక్టీస్‌లో పోలీసు సిబ్బంది

ఫైరింగ్‌ చేస్తున్న ఎస్పీ డి.సునీతారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement