సాగు విధానాల్లో మార్పు అవసరం | - | Sakshi
Sakshi News home page

సాగు విధానాల్లో మార్పు అవసరం

Jul 26 2026 7:48 AM | Updated on Jul 26 2026 7:48 AM

గోపాల్‌పేట: ఎల్‌నినో కారణంగా సాంప్రదాయ సాగు విధానాల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి అన్నారు. శనివారం మండలంలోని తిర్మలాపూర్‌లో ఎన్‌నినో ప్రభావం.. రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయనతో పాటు కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ.. రైతులు దిగుబడి మాత్రమే కాకుండా పెట్టుబడి, నీటి లభ్యత, మార్కెటింగ్‌ అవకాశాలను కూడా దృష్టిలో ఉంచుకొని పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి ప్రభుత్వం సూచిస్తున్న పద్ధతులను పాటించాలని చెప్పారు. వ్యవసాయ, ఉద్యాన అధికారులు ప్రతి గ్రామంలో రైతులకు అవసరమైన సూచనలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. రైతులు నీటిగుంతలు, ఇంకుడు గుంతలు, సూక్మ నీటిపారుదల పద్ధతులను విస్తృతంగా వినియోగించాలని పిలుపునిచ్చారు. కంది, పప్పుధాన్యాలు, కూరగాయలు, ఇతర ఉద్యాన సాగుపై దృష్టి సారించాలని సూచించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఎల్‌నినో రాష్ట్ర కమిటీ చైర్మన్‌గా డా. చిన్నారెడ్డి ఎంపిక కావడం గొప్ప విషయమన్నారు. జిల్లాలో ఈ ఏడాది 34 శాతం మేర కరువు పరిస్థితులు ఉన్నాయని.. మండలంలో 40 శాతం వరకు నమోదు అయిందని తెలిపారు. జయన్న తిర్మలాపూర్‌లో సుమారు మూడు వేల ఎకరాల్లో సాగు జరుగుతుండగా.. అందులో 700 ఎకరాలు పూర్తిగా వర్షాధార పంటలే ఉన్నాయని తెలిపారు. ఇలాంటి సమయాల్లో అధిక నీరు అవసరం ఉన్న వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ లక్ష్మీగోపాల్‌, జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు, మండల ప్రత్యేక అధికారి సుధీర్‌రెడ్డి, కాంగ్రెస్‌పార్టీ మండల అధ్యక్షుడు గగనం నరహరి, మండలస్థాయి అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement