కొత్తకోట రూరల్: అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు జాబితాలో నమోదయ్యేలా చూడాల్సిన బాధ్యత బీఆర్‌ఎస్ నాయకులు, బీఎల్‌ఏలపై ఉందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. శనివారం పెద్దమందడి మండలం బుగ్గపల్లితండా, అమ్మపల్లి, అమ్మపల్లితండాలో పర్యటించి ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను ఆయన పరిశీలించారు. అనంతరం బీఎల్వోలు, పార్టీ నాయకులతో మాట్లాడుతూ.. సమయం తక్కువగా ఉన్నందున ప్రజలకు అవగాహన కల్పించి అర్హుల ఓట్లు తప్పకుండా నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొన్ని బూత్‌లలో బీఎల్వోలపై పని భారం అధికంగా ఉందని, అదనపు సిబ్బందిని నియమించి సకాలంలో ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను కోరారు. వెంట జిల్లా రైతుబంధు సమితి మాజీ అధ్యక్షుడు జగదీశ్వర్‌రెడ్డి, జెడ్పీ టీసీ మాజీ సభ్యుడు రఘుపతిరెడ్డి, సర్పంచ్ శ్రీనివాస్‌గౌడ్, కుమార్ యాదవ్ పాల్గొన్నారు.
ఇంకుడు గుంతలు
నిర్మించుకోవాలి
పాన్‌గల్: వర్షపు నీటిని సంరక్షించేందుకు ప్రతి ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతలు తప్పనిసరిగా నిర్మించుకోవాలని డీఆర్డీఓ ఉమాదేవి సూచించారు. శనివారం మండలంలోని చింతకుంటలో సర్పంచ్ కోట్ల రాములు అధ్యక్షతన జరిగిన ప్రత్యేక గ్రామసభకు ఆమె హాజరై మాట్లాడారు. పొలాల్లోని బోరుబావుల దగ్గర ఇంకుడు గుంతలు నిర్మించుకోవడంతో వీబీజీ రాంజీ ద్వారా రూ.7 వేలు, వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించుకునే వారికి రూ.12 వేలు అందుతాయన్నారు. పశువుల షెడ్, ఫాంపాండ్ నిర్మాణాలు చేపడితే ఆర్థిక సాయం మంజూరు చేయనున్నట్లు చెప్పారు. కొలతల ప్రకారం పనిచేస్తేనే ఉపాధిహామీ డబ్బులు వస్తాయన్నా రు. సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉంటూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. సమా వేశంలో ఎంపీడీఓ గోవిందరావు, పంచాయతీ కార్యదర్శి, ఏఈఓ, రైతులు పాల్గొన్నారు.
నేడు బ్యారేజీల పరిశీలన
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: భీమా, కృష్ణానదులపై కర్ణాటక ప్రభుత్వం చేపడుతున్న చెక్‌డ్యాంలు, బ్యారేజీలను బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలతో కలిసి ఆదివారం పరిశీలిస్తామని మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. హైడ్రాలిక్ గేట్లు ఏర్పాటు చేసి తెలంగాణకు నీళ్లు రాకుండా చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా ఆర్డీఎస్ వద్ద కర్ణాటక, ఏపీ రాష్ట్రాలు అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తున్నారన్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయని, కర్ణాటక నుంచి నీరు రాకుంటే తెలంగాణ రైతులు వచ్చే యాసంగిలో పంటలు వేసే పరిస్థితి లేకుండా పోతుందన్నారు. ఈ పరిస్థితి మారే వరకు బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో పోరాటం చేపడుతామని హెచ్చరించారు.


