వనపర్తిటౌన్: ఆస్తుల కంటే విజ్ఞానం గొప్పదని.. విద్యార్థులు కష్టపడి చదివి ఎంచుకున్న ఉన్నత లక్ష్యాన్ని సాధించి పాఠశాలకు మంచి గుర్తింపు తీసుకురావాలని ఇన్‌చార్జ్ జిల్లా విద్యాధికారి యాదయ్య కోరారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని హరిజనవాడ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన నగదు ప్రతిభ ప్రోత్సాహక పురస్కార మహోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఆస్తులు తింటే తరుగుతాయి.. కానీ విజ్ఞానం ఉంటే ఎన్ని ఆస్తులైనా సంపాదించ వచ్చన్నారు. వైద్యులు, ఇంజినీర్లు, ఉపాధ్యాయులు, న్యాయవాదులుగా ఎదిగి సమాజానికి ఆదర్శంగా నిలవడంతో పాటు తోటి వారిని ప్రోత్సహించాలని సూచించారు. పాఠశాలలో ఉన్న సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 2026లో 10వ తరగతిలో 566 మార్కులు సాధించి మహబూబ్‌నగర్ ట్రిపుల్ ఐటీలో సీటు సాధించిన నజీరా, కరీంనగర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతున్న కృతికకు నగదు ప్రోత్సాహకం అందజేయడంతో పాటు 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించారు. కృతిక ఉన్నత విద్యకు ఆత్మకూర్ బాలవర్ధన్ రెడ్డి గతేడది రూ.20 వేలు, ఈ ఏడాది రూ.50 వేలు, 18వ వార్డు కౌన్సిలర్ గంధం మదన్ రూ.10 వేలు, సీనియర్ ఉపాధ్యాయుడు వాకిట రవికుమార్ రూ.10 వేలు, అరవింద్ రూ.10 వేలు అందజేశారు. 500కు పైగా మార్కులు సాధించిన అబ్దుల్ ఆదిల్, భార్గవి, భానుప్రకాశ్, జయచంద్ర, జ్ఞానేశ్వరికి ప్రధానోపాధ్యాయుడు చంద్రశేఖర్ రూ.వెయ్యి, ఆత్మకూర్ బాలవర్ధన్‌రెడ్డి రూ.వెయ్యి చొప్పున నగదు అందజేశారు. కార్యక్రమంలో ఏసీజీ అండ్ జీహెచ్‌ఎం గణేష్‌కుమార్, సామాజిక కార్యకర్తలు గంధం నాగరాజు, భోజరాజు వెంకటేష్, విశ్వంబాబు, శంకర్‌గౌడ్, చంద్రశేఖర్, శ్రీనివాసులు, మహిపాల్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
బకాయి వేతనాలు
చెల్లించాలి
ఖిల్లాఘనపురం: సామాజిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల బకాయి వేతనాలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పి.సురేష్ కోరారు. శుక్రవారం మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో కార్మికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. ఆస్పత్రుల్లో విధులు నిర్వర్తిస్తున్న పారిశుద్ధ్య, సెక్యూరిటీ, పేషెంట్ కేర్, సూపర్‌వైజర్ తదితర కార్మికులకు మూడునెలలుగా వేతనాలు రావడం లేదన్నారు. ప్రభుత్వం ఒకటో తేదీనే వేతనాలు చెల్లిస్తామని చెప్పినా ఎక్కడా అమలుకావడం లేదని వాపోయారు. ప్రభుత్వం తక్షణమే పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కార్మికులు సాయికృష్ణ, భీమయ్య, శివ, స్వాతి, ప్రియాంక, నజ్మ, నాగయ్య, వెంకటేష్, మునీందర్ పాల్గొన్నారు.
‘కేంద్ర విధానాలు దేశానికి ప్రమాదం’
వనపర్తి రూరల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిరంకుశ విధానాలు దేశానికి తీవ్ర ప్రమాదకరమని.. యువత భవిష్యత్‌ను దోచుకుంటున్న పాలకులపై ఉద్యమించాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కల్లూరి ధరేంద్ర పిలుపునిచ్చారు. జిల్లాకేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో శుక్రవారం ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు మహేష్ అధ్యక్షతన 3వ మహాసభలు నిర్వహించగా.. ఆయన పాల్గొని మాట్లాడారు. నిరుద్యోగం, ఉద్యోగాల భర్తీలో జాప్యం, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ దోపిడీ, పరిశ్రమల కొరతతో జిల్లా యువత వలసబాట పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పోరేట్ల కోసం యువత జీవితాలతో పాలకులు చెలగాటమాడుతున్నారని.. నీట్ అక్రమాలే ఇందుకు నిదర్శనమన్నారు. శాశ్వత ఉద్యోగాలు, నాణ్యమైన విద్య, వైద్యం, క్రీడారంగాన్ని అభివృద్ధి చేయడమే నిజమైన ప్రగతని స్పష్టం చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి విజయరాములు మాట్లాడుతూ.. యువత కేవలం ఉద్యోగాలకే పరిమితం కాకుండా, శాంతి, అభ్యుదయం, శాసీ్త్రయ సోషలిజం అనే సిద్ధాంతంతో ప్రజా సమస్యలపై పోరాడాలన్నారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర సమన్వయ కార్యదర్శి బిజ్జ శ్రీనివాసులు, కుతుబ్, సీపీఐ నేత రమేష్, సురేష్, విష్ణు, మహబూబ్, పరమేష్, వివిధ మండలాల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


