వనపర్తి: ప్రభుత్వ పాఠశాలలు, కస్తూర్బాలు, గురుకులాలు, మోడల్ స్కూళ్లలో చదివే విద్యార్థులకు ఆగస్టు 15లోగా యూనిఫామ్స్ అందజేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. జిల్లాలో వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యతకు అనుగుణంగా రైతులు పంటమార్పిడి చేసుకునేలా రైతులను ప్రోత్సహిస్తున్నామని, అందుకు సరిపడా విత్తనాలు, ఎరువులు అందజేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించామన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సంజయ్ జాజు విద్యార్థుల యూనిఫామ్స్ పంపిణీపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెనన్స్ నిర్వహించగా.. జిల్లా నుంచి కలెక్టర్ పాల్గొని వివరాలు వెల్లడించారు. జిల్లాలోని 512 పాఠశాలల్లో 38,653 విద్యార్థులు, 15 కేజీబీవీల్లో 4,531 మంది విద్యార్థులు, 3 మోడల్ స్కూళ్లలో 1,919 విద్యార్థులు, గురుకులాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు రెండు జతల యూనిఫామ్స్ ఇవ్వడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. జిల్లాలో శిక్షణ పొందిన 358 స్వయం సహాయక సంఘాల టైలర్లను గుర్తించామని.. ఇప్పటి వరకు వచ్చిన వస్త్రాన్ని ఎప్పటికప్పుడు మండలాలకు విభజించి కుట్టేందుకు టైలర్లకు అందజేస్తామన్నారు. ప్రతి విద్యార్థికి ఆగస్ట్ 15లోగా ఒక జత, ఆగస్టు 25లోగా రెండోజత అందజేసే విధంగా చర్యలు తీసుకోవాలని డీఆర్డీఓను ఆదేశించారు.
● వ్యవసాయశాఖకు సంబంధించి జిల్లాలో ఇప్పటి వరకు కురిసిన వర్షాలు, సమస్యాత్మక గ్రామాలు, ఇప్పటి వరకు చేపట్టిన సాగు విస్తీర్ణాన్ని వివరించారు. ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. కంది, నువ్వులు, వేరుశనగ సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. జిల్లాలో కూరగాయల సాగు సైతం పెంచేందుకు వ్యవసాయ, ఉద్యాన అధికారులను ఆదేశించామని చెప్పారు. వీడియో కాన్ఫరెనన్స్‌లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్, ఇన్‌చార్జ్ జిల్లా విద్యాధికారి యాదయ్య, డీఆర్డీఓ ఉమాదేవి, వ్యవసాయశాఖ అధికారి ఆంజనేయులు, ఉద్యాన అధికారి విజయభాస్కర్, సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్ ఆదర్శ్‌సురభి..
జిల్లా అధికారులు


