వనపర్తి: జిల్లా పోలీసు అధికారులు నెలరోజుల వ్యవధిలో సుమారు రూ.65 లక్షల విలువైన 236 సెల్‌ఫోన్లను రికవరీ చేసినట్లు ఎస్పీ సునీతారెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో బాధితులకు ఫోన్లను అందజేసి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. స్మార్ట్‌ఫోన్ పోగొట్టుకుంటే ఎలా ఫిర్యాదు చేయాలనే విషయాన్ని వివరించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు మరో ఐదు రాష్ట్రాల్లో ఉన్న సెల్‌ఫోన్లను స్థానిక బృందాలు ప్రత్యేక దృష్టి సారించి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ఆధునిక సాంకేతికతను సమర్థవంతంగా వినియోగిస్తూ సీఈఐఆర్ వ్యవస్థను ఉపయోగించి చోరీకి గురైన ఫోన్లను గుర్తించి బాధితులకు అందించినట్లు చెప్పారు. పోగొట్టుకున్న మొబైల్ విలువ కంటే అందులోని ఫొటోలు, సమాచారం, కాంటాక్ట్ నంబర్ల విలువ ఎంతో ఎక్కువని అభిప్రాయపడ్డారు. మొబైల్ ఫోన్లు పోగొట్టుకోవడం, చోరీకి గురైనప్పుడు బాధితులు వెంటనే https://www.ceir.gov.in అనే వెబ్‌సైట్‌లోగాని దగ్గర్లోని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. జిల్లాలో ఈ ఏడాది ఇప్పటి వరకు 500 మొబైల్ ఫోన్లను బాధితులకు తిరిగి అందజేశామన్నారు. సెల్‌ఫోన్ల రికవరీకి కృషి చేసిన సీసీఎస్ సీఐ పవార్ అశోక్‌కుమార్, ఎస్‌ఐ రామరాజు, ఏఎస్‌ఐ తిరుపతిరెడ్డి, హెడ్ కానిస్టేబుళ్లు ఎన్.రాజగౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, కృష్ణయ్య, బాలయ్య, రాఘవేందర్, కానిస్టేబుళ్లు బెద్దడి స్వామి, మురళీకృష్ణ, సమరసింహారెడ్డి, మురళి, సత్యనారాయణ, భూపాల్‌కు ఎస్పీ క్యాష్ రివార్డ్ అందజేసి అభినందించారు. కార్యక్రమంలో డీఎస్పీ గిరిబాబు, డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీనాయక్ పాల్గొన్నారు.


