వనపర్తి: రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాలను సమర్థవంతంగా అరికట్టేందుకు ప్రతి పోలీసు అధికారి అప్రమత్తంగా పనిచేయాలని డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ నేరస్తులను వేగంగా గుర్తించి చట్టం ముందు నిలబెట్టడంతో పాటు ప్రజల్లో విస్తృతస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో సైబర్ మోసాలను గణనీయంగా తగ్గించవచ్చన్నారు. గురువారం హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయం నుంచి పోలీసు కమిషనర్లు, జిల్లా ఎస్పీలు, క్షేత్రస్థాయి పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా నుంచి ఎస్పీ డి.సునీతరెడ్డి పాల్గొని వివరాలు వెల్లడించారు. వీసీలో డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీనాయక్, సైబర్‌క్రైమ్ సీఐ శ్రీను నాయక్, సైబర్ క్రైమ్ ఎస్‌ఐ రవిప్రకాష్, స్పెషల్ బ్రాంచ్ ఎస్‌ఐలు మంజునాథరెడ్డి, నరేష్, డీసీఆర్బీ ఎస్‌ఐ తిరుపతిరెడ్డి, ఐటి కోర్ సిబ్బంది గోవింద్, రవీంద్రబాబు పాల్గొన్నారు.
జీఓ 60 ప్రకారం వేతనాలు చెల్లించాల్సిందే
మహబూబ్‌నగర్ న్యూటౌన్: జీఓ నెంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించాల్సిందేనని రాష్ట్ర మెడికల్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పి.సురేశ్ డిమాండ్ చేశారు. గురువారం జనరల్ ఆస్పత్రిలో కాంట్రాక్టు ఏజెన్సీ నిర్వాహకులతో యూనియన్ నేతలు, కార్మిక సంఘం నాయకుల ఆధ్వర్యంలో చర్చలు జరిపారు. కనీస వేతనాలు అమలు చేయాలని, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. పారిశుద్ధ్య, సెక్యూరిటీ, పేషెంట్ కేర్, సూపర్‌వైజర్స్ కార్మికులకు పూర్తిస్థాయి వేతనం అమలుకు చర్యలు తీసుకోవాలన్నారు. వేతనాల సమస్యపై మరోసారి సమావేశం నిర్వహించి, నిర్ణయం తీసుకుంటామని ఏజెన్సీ నిర్వాహకులు పేర్కొన్నారు. ఏజెన్సీ నిర్వాహకులు శ్రీవాణి, రాఘవేందర్, యూనియన్ నాయకులు రంగన్న, చెన్నయ్య, యాదయ్య పాల్గొన్నారు.


