ఖిల్లాఘనపురం: విద్యాపరంగా జిల్లాను రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిపేందుకు ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేయాలని ఇన్‌చార్జి జిల్లా విద్యాధికారి యాదయ్య కోరారు. మండలంలోని సోళీపురం ఉన్నత పాఠశాలలో మూడురోజులుగా కొనసాగుతున్న ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాన్ని గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అలాగే దొంతికుంటతండా స్టేజీ సమీపంలో ఉన్న తెలంగాణ మోడల్ పాఠశాలను సందర్శించి కొనసాగుతున్న మరమ్మతులను పరిశీలించారు. ఇంటర్ బాలికల వసతి గృహాన్ని పరిశీలించి వసతులపై ఆరా తీశారు. పదోతరగతి, ఇంటర్ విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశమై ఉత్తమ ఫలితాలు సాధించేందుకు పలు సూచనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఐదేళ్లుగా నిర్వహిస్తున్న ఎఫ్‌ఎల్‌ఎన్ కార్యక్రమంలో రాష్ట్రంలో జిల్లా రెండోస్థానంలో నిలిచిందని, ఇందులో ఉపాధ్యాయుల కృషి ఎంతో ఉందన్నారు. ప్రతి తరగతిలో వెనుకబడిన విద్యార్థులను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై శిక్షణనిస్తున్నట్లు చెప్పారు. శిక్షణలో అందించే అంశాలను ఉపాధ్యాయులు అర్థం చేసుకొని విద్యార్థులను టాపర్లుగా నిలిపేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన రైతు అవగాహన సదస్సులో పాల్గొని ప్రస్తుత పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో జీసీడీఓ నారాయణమ్మ, ఎంపీడీఓ విజయసింహారెడ్డి, ఎస్‌ఓ శేఖర్, ఎంఈఓ జయశంకర్, ఏఓ మల్లయ్య, పాఠశాల ప్రిన్సిపాల్ ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.


