వనపర్తి రూరల్: రాజకీయ పార్టీలు బాధ్యతగా తీసుకొని సర్ ప్రక్రియను వేగవంతం చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని అచ్చుతాపురం, రాజనగరంలో కొనసాగుతున్న ఎన్యూమరేషన్ విధానాన్ని స్థానిక బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. పట్టణ కేంద్రంలో 57 శాతం పూర్తయిందని.. అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ శ్రేణులు అప్రమత్తమై ప్రతి ఇంటికి తిరుగుతూ అర్హులైన ఓటర్లను గుర్తించి తుది జాబితాలో పేరు ఉండేవిధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో జాబితా సవరణ ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు గ్రామాల్లో ఉన్న సమస్యలు తెలుసుకొని ప్రజలకు అండగా ఉండాలని సూచించారు. అనంతరం గ్రామంలోని మండల మహిళా సమాఖ్య మాజీ అధ్యక్షురాలు సిలిమూర్తి చిట్టెమ్మ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. వారి ఇంటికి వెళ్లిన మాజీ మంత్రి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సర్పంచ్ శాంతయ్య, జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, మాధవరెడ్డి, మండల అధ్యక్షులు మాణిక్యం, ధర్మానాయక్, డేగ మహేశ్వర్‌రెడ్డి, చిట్యాల రాము, శంకర్ నాయక్ పాల్గొన్నారు.
ఆగస్టు 15లోగా
యూనిఫామ్స్ అందించాలి
పాన్‌గల్: పాఠశాలల విద్యార్థులకు ఆగస్టు 15లోపు యూనిఫామ్స్ అందించేలా దర్జీలు ప్రయత్నించాలని డీపీఎం నాగమల్లిక అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో యూనిఫామ్స్ వస్త్రాన్ని ఆమె పరిశీలించి అనంతరం ఎమ్మార్సీ కార్యాలయంలో ఎంఈఓ ఆనంద్‌తో సమావేశమయ్యారు. మండలంలోని పాఠశాలల వారీగా విద్యార్థుల సంఖ్య, ఆయా గ్రామాల్లో యూనిఫామ్స్ కుట్టేందుకు అవసరమైన దర్జీలపై చర్చించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించే యూనిఫామ్స్ క్లాథ్‌ను పాఠశాలల వారీగా దర్జీలకు వెంటనే పంపిణీ చేయాలన్నారు. దర్జీలకు అందజేసిన యూనిఫామ్స్‌పై సీసీలు పర్యవేక్షణ చేస్తూ ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని కోరారు. ఐకేపీలో ఏపీఎం పోస్టును భర్తీ చేయకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్న విషయాన్ని ఆమె దృష్టికి తీసుకరాగా డీఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే భర్తీ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో సీసీలు సువర్ణ, వసంత పాల్గొన్నారు.
న్యాయ సేవలపై
అవగాహన ఉండాలి
వనపర్తి రూరల్: ఉచిత న్యాయ సేవలపై విదార్థులు అవగాహన కలిగి ఉండాలని డీసీఓ శ్రీవేణి అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి, సీనియర్ న్యాయమూర్తి కళార్చన ఆదేశాల మేరకు బుధవారం మండలంలోని పెద్దగూడెం శివారులో ఉన్న కడుకుంట్ల ఎంజేపీ గురుకుల పాఠశాలలో ఉచిత న్యాయ సేవలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కృష్ణయ్యతో కలిసి ఆమె పాల్గొని మాట్లాడారు. వాహనంపై ఏర్పాటు చేసిన తెరపై లఘు చిత్రాలను ప్రదర్శించి విద్యార్థులకు చట్టాలపై సులభంగా అవగాహన కల్పించారు. విద్యా హక్కుచట్టం, బాల్య వివాహాలు, బాలకార్మిక వ్యవస్థ, సైబర్‌క్రైమ్ చట్టాల గురించి వివరించారు. ఉచిత న్యాయ సేవలకు టోల్‌ఫీ నంబర్ 15100 సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, డిప్యూటీ లీగల్ ఎయిడ్ సభ్యులు పాల్గొన్నారు.
బీసీ స్టడీ సర్కిల్‌లో
ఉచిత శిక్షణ
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలోని బీసీ స్టడీసర్కిల్‌లో గ్రూప్స్, ఆర్‌ఆర్‌బీ, ఎస్సెస్సీ, బ్యాకింగ్ వంటి పోస్టులకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి విష్ణునందన్, స్టడీ సర్కిల్ డైరెక్టర్ స్వప్న ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల నారాయణపేట, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో వచ్చే నెల14లోగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. గతంలో శిక్షణ పొందిన వారు అనర్హులని, మరింత సమాచారం కోసం 74167 31371 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.


