వనపర్తి: ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్‌తో కలిసి మండలస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెనన్స్ నిర్వహించి పలు కీలక సూచనలు చేశారు. జిల్లాలో గుడిసెలు, టార్పాలిన్ షెడ్లలో నివసిస్తున్న కుటుంబాలపై క్షేత్రస్థాయిలో మరోసారి సమగ్ర సర్వే నిర్వహించాలన్నారు. ప్రభుత్వం ప్రస్తుతం గుడిసెల్లో నివసించే వారికే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసే లక్ష్యంతో పనిచేస్తోందన్నారు. జిల్లాలో గుడిసెల్లో నివసిస్తున్న వారికి సంబంధించి ఇప్పటికే గుర్తించిన 1,367 కుటుంబాల జాబితాపై ప్రభుత్వం రీ–సర్వే నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసినందున ఎంపీడీవోలు, వెరిఫికేషన్ అధికారులు ఈ ప్రక్రియను వారం రోజుల్లో పూర్తి చేయాలన్నారు. అలాగే ఈ ఏడాది జిల్లాపై ఎల్‌నినో ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందని, ప్రస్తుతం వర్షాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో రైతులను అప్రమత్తం చేయాలన్నారు. ప్రతి గ్రామంలో రైతులతో సమావేశాలు నిర్వహించి, వరికి బదులుగా తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలైన కంది, పెసర, మినుములు, వేరుశనగ, కూరగాయలు తదితర పంటల సాగుపై అవగాహన కల్పించాలని కోరారు. అదేవిధంగా ఉద్యాన పంటలైన ఆయిల్‌పాం ఇతరాత్ర వాటిని కూడా ప్రోత్సహించాలన్నారు. రోజు కనీసం రెండు గ్రామాల్లో రైతు అవగాహన సమావేశాలు నిర్వహించాలని, వర్షాధార వ్యవసాయంపై పూర్తిగా ఆధారపడకుండా రైతులను చైతన్యపర్చాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావాన్ని ఓ సవాలుగా స్వీకరించి, నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా వ్యవసాయ, ఉద్యానవనశాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. వర్షాధార పంటలు వేసి రైతులు నష్టపోకుండా వారిని అవగాహన కల్పించి రక్షించాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, డీఆర్డీఓ ఉమాదేవి, హౌసింగ్ పీడీ విఠోబా, జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు, ఉద్యానశాఖ అధికారి విజయభాస్కర్, పంచాయతీ అధికారి రఘునాథ్ రెడ్డి, మండల స్థాయిలో తహసిల్దార్లు, ఎంపీడీవోలు, ఎంఏఓ లు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.


