మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: నేషనల్ సెమినార్‌ను యూనివర్సిటీలోనే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం పీయూ విద్యార్థులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ మేరకు పీయూ ఫార్మసీ కళాశాల హాస్టల్ వద్ద మధ్యాహ్న భోజనాన్ని బహిష్కరించి నిరసన తెలిపారు. యూనివర్సిటీకే తలమానికంగా నిలిచే నేషనల్ సెమినార్‌ను హైదరాబాద్‌లో నిర్వహించడం సరైన పద్ధతి కాదన్నారు. అధికారులు మొండిపట్టు వీడి యూనివర్సిటీలోనే కార్యక్రమం నిర్వహించాలని డిమాండ్ చేశారు. పీఎం ఉషా ద్వారా రూ.100 కోట్లు విడుదలైతే వాటికి సంబంధించిన నిర్మాణాలు ఇప్పటికీ పూర్తికాలేదని, వాటిని కప్పిపుచ్చుకునేందుకే అధికారులు కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారని ఆరోపించారు. అధికారులు నిర్ణయం మార్చుకోకపోతే నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు.


