వనపర్తి: ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో వర్షాధార సాగుపై ఆధారపడే రైతులు నష్టాల పాలుకాకుండా పంట మార్పిడీపై విస్తృతస్థాయిలో అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఉద్యాన అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో వ్యవసాయ, ఉద్యాన అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అధికారులు గ్రామాల వారీగా రైతులతో సమావేశాలు నిర్వహించాలని.. కేవలం వరి సాగుకే పరిమితం కాకుండా భూభాగం, నేల స్వభావం, నీటి లభ్యత ఆధారంగా కూరగాయలు, ఉల్లి, మినుము, కంది, వేరుశనగ తదితర పంటలు సాగు చేసేలా ప్రోత్సహించాలన్నారు. ఆయా ప్రాంతాలకు అనుకూలమైన, లాభదాయకమైన పంటల సాగు వైపు మళ్లించేలా అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఉద్యాన అధికారులు ఆయిల్‌పాం సాగు విస్తరణపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతి అధికారి సాగు లక్ష్యాలను నిర్దేశించుకొని తప్పనిసరిగా సాధించాలన్నారు. రాబోయే 15 రోజులు వ్యవసాయ, ఉద్యాన అధికారులు సెలవులు లేకుండా పూర్తిస్థాయిలో గ్రామాల్లో పర్యటిస్తూ రైతులను చైతన్యపర్చాలని కోరారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు, జిల్లా ఉద్యాన అధికారి విజయభాస్కర్, ప్రి–యూనిక్ సంస్థ సీపీఓ సింగారెడ్డి, ఏఓలు, ఏఈఓలు తదితరులు పాల్గొన్నారు.


