అమరచింత (ఆత్మకూర్): ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్)పై బీఎల్‌ఓలు నిర్లక్ష్యంగా ఉండొద్దని, ఓటర్లకు ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫారాలను తిరిగి తీసుకొని ఆన్‌లైన్ చేయాల్సిన అవసరం ఉందని నారాయణ పేట జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసులు అన్నారు. ఆత్మకూర్ పట్టణంలో కొనసాగుతున్న సర్ కార్యక్రమాన్ని ఆయన తహసీల్దార్ జేకే మోహన్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లు సేకరించి ఓటరు సవరణ కార్యక్రమం గురించి వివరించి, ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని బీఎల్‌ఓలకు సూచించారు. ప్రతినిత్యం తమకు కేటాయించిన క్యాచ్‌మెంట్ ఏరియాలో ఉంటూ.. ఫారాలు సేకరించి వందశాతం ఆన్‌లైన్ నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరేష్, మేనేజర్ సీత్యానాయక్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.


