ఖిల్లాఘనపురం: రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కోరారు. మంగళవారం మండల కేంద్రంతో పాటు సోళీపురం గ్రామంలో జిల్లా మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ బాలీశ్వర్‌రెడ్డి, జెడ్పీటీసీ మాసీ సభ్యుడు సామ్యానాయక్, పార్టీ మండల అధ్యక్షుడు రాళ్ల కృష్ణయ్యతో కలిసి సర్ కార్యక్రమాన్ని పరిశీలించారు. బీఎల్వోలు, బీఎల్‌ఏలతో మాట్లాడి ఎన్యూమరేషన్ ఫారాలు నింపే సమయంలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధమని.. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలన్నారు. బీఎల్వోలు ఇంటింటికి తిరిగి ఎన్యూమరేషన్ ఫారాలు పంచడమే కాకుండా వారు ఫారాలు ఎలా నింపారు.. ఏమైనా తప్పులున్నాయా అనే వివరాలను పరిశీలించి తిరిగి తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో ఉన్న బీఆర్‌ఎస్ బీఎల్‌ఏలు మాత్రమే కాకుండా చదువుకున్న యువత ముందుకొచ్చి ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు నింపే విషయంలో సహకారం అందించాలన్నారు. అనంతరం ఇటీవల ప్రమాదవశాత్తు కాలు విరిగిన పార్టీ కార్యకర్త కుమ్మరి కృష్ణయ్యను పరామర్శించారు. ఆయన వెంట పార్టీ ప్రధాన కార్యదర్శి పురేందర్‌రెడ్డి, సర్పంచ్‌లు బాలరాజు, గిరమ్మ వెంకటయ్య, ఉప సర్పంచులు పీన్యానాయక్, కృష్ణయ్యగౌడ్ ఉన్నారు.


