ఆశలు.. అడియాశలు! | - | Sakshi
Sakshi News home page

ఆశలు.. అడియాశలు!

Jul 14 2026 12:36 AM | Updated on Jul 14 2026 12:36 AM

ప్రశ్నార్థకంగా మారిన జూరాల ఆయకట్టు సాగు

ఎదురుచూస్తున్నాం..

జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వ ఆయకట్టు పరిధిలోని మూలమళ్ల శివారులో 10 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకున్నా. గత యాసంగిలో కేవలం 5 ఎకరాలు మాత్రమే సాగులోకి వచ్చింది. ఈసారైనా పుష్కలంగా నీరు అందుతుందని వరినారు సిద్ధం చేసుకున్నా. ఆరుద్ర కార్తెలో వరినాట్లు వేసుకోవచ్చని అనుకోగా.. ఇప్పటికీ జూరాల డ్యాంకు నీరు చేరలేదు. సాగునీటి కోసం ఎదురుచూస్తున్నాం.

– ఎల్లన్న, కౌలు రైతు, మూలమళ్ల

యాసంగిలో కూడా పంట వేయలేదు..

జూరాల ఎడమ కాల్వ ఆయకట్టుకు అనుసంధానంగా ఉన్న అమరచింత ఎత్తిపోతల పథకానికి సాగునీటిని విడుదల చేయాలి. యాసంగిలో ప్రాజెక్టులో నీరు లేక ఎత్తిపోతల పథకం ఆయకట్టుకు క్రాప్‌హాలిడే ప్రకటించారు. వానాకాలం సాగుకై నా సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలి.

– నర్సింహులు, రైతు, అమరచింత

ప్రాజెక్టుకు నీరు వస్తేనే..

జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద పుష్కలంగా వస్తేనే కాల్వలకు సాగునీరు వదిలే అవకాశం ఉంటుంది. రైతులు తొందరపడి నారుమడులను వేసుకోవద్దనే విషయాన్ని సైతం ఆయకట్టు గ్రామాల్లో చెప్పడం జరిగింది. ఆయకట్టు రైతులు అధికారుల సూచనలు పాటించాలి.

– సమి ఉల్లా, డీఈ,

పీజేపీ నందిమళ్ల డివిజన్‌

అమరచింత: ఈసారి వానాకాలం సాగుపై రైతన్నలు ఆశలు వదులుకునే పరిస్థితులు దాపురించాయి. ఎల్‌నినో ప్రభావంతో వరుణుడు కరుణించకపోవడం.. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద లేక జలకళ తప్పడం వంటి పరిస్థితులతో ఆయకట్టు సాగు ప్రశ్నార్థకంగా మారుతోంది. ప్రతి ఏటా ఇదివరకే జూరాలకు వరద వచ్చేది. ఆయకట్టు పొలాలు వరిసాగుతో కళకళలాడేవి. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా పరిస్థితి కనిపిస్తోంది. గత యాసంగి సీజన్‌లోనూ ఎడమ కాల్వ పరిధిలో కేవలం 20వేల ఎకరాలకు మాత్రమే సాగునీటిని వదులుతామని ప్రాజెక్టు అధికారులు ప్రకటించడంతో అమరచింత, ఆత్మకూర్‌, మదనాపురం మండలాలకు చెందిన రైతులు మాత్రమే వరిసాగు చేసుకున్నారు. ఎడమ కాల్వ దిగువన ఉన్న కొత్తకోట, పెబ్బేరు, శ్రీరంగాపురం, వీపనగండ్ల, చిన్నంబావి మండలాల రైతులకు క్రాప్‌హాలిడే ప్రకటించారు. వానాకాలంలో అయినా వరిసాగు చేసుకుందామని ఆశపడిన ఆయకట్టు రైతులకు.. నిరాశే ఎదురవుతోంది. జూరాల జలాశయంలో క్రమంగా నీటిమట్టం అడుగుంటిపోతుండటంతో ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు.

వర్షాభావ పరిస్థితులతో జలాశయానికి చేరని వరద

గత యాసంగిలోనూ 20వేల ఎకరాలకే సాగునీరు

వానాకాలం సాగుపై ఆశలు వదులుకుంటున్న రైతులు

ఎడమ కాల్వ పరిధిలో ఇలా..

ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఎడమ కాల్వపైనే చంద్రఘడ్‌, అమరచింత, కురుమూర్తిరాయ ఎత్తిపోతల పథకాలు ఆధారపడి ఉన్నాయి. ఈ కాల్వ పరిధిలో ఆయకట్టు విస్తీర్ణం 85వేల ఎకరాలకు చేరింది. జిల్లాలోనే అత్యధికంగా 35 కి.మీ. మేరకు ఎడమ కాల్వ విస్తరించి ఉండటంతో ప్రాజెక్టు ప్రధాన ఆయకట్టు జిల్లా పరిధిలోనే ఉంది. అమరచింత, ఆత్మకూర్‌, మదనాపురం, పెబ్బేరు, కొత్తకోట, శ్రీరంగాపురం, వీపనగండ్ల, చిన్నంబావి మండలాలకు చెందిన కొందరు రైతులు కొంతమేర తమ భూములను ప్రాజెక్టు కాల్వ నిర్మాణానికి ఇచ్చారు. మిగిలిన భూములకు సాగునీరు పుష్కలంగా అందుతుందని అప్పట్లో రైతులు ఆశపడ్డారు. కానీ ప్రతి సంవత్సరం సాగునీటి సమస్యతో పంట పొలాలను బీడుగా వదిలేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement