వనపర్తి: జిల్లాలోని కొత్తకోటలో ఈ నెల 15న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో ఎస్పీ సునీతారెడ్డితో కలిసి సీఎం పర్యటనపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 15న మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కొత్తకోటకు చేరుకుంటారని తెలిపారు. 2:15 గంటలకు ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాల నూతన భవనాన్ని ప్రారంభిస్తారన్నారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి నిర్వహిస్తారని.. ఈ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం ఆయా శాఖల అధికారులకు పలు బాధ్యతలు అప్పగించారు. వీసీలో అదనపు కలెక్టర్లు ఎన్.ఖీమ్యానాయక్, వినోద్ కుమార్, డీఈఓ యాదయ్య, డీఎస్పీ బాలాజీ నాయక్, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్లు రజనీకాంత్, మేడం శ్రావ్య తదితరులు ఉన్నారు.
విద్యావ్యవస్థ బలోపేతానికి కృషి
కొత్తకోట: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అన్నారు. కొత్తకోటలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల భవనాన్ని 15న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్న నేపథ్యంలో సోమవారం కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ సునీతారెడ్డి, విద్యాశాఖ అధికారులతో కలిసి ఆయన ఏర్పాట్లను పరిశీలించి మాట్లాడారు. రూ. 1.77కోట్ల సీఎస్‌ఆర్ నిధులు, దాతల సహకారంతో బాలికల ఉన్నత పాఠశాల, రూ.33.50 లక్షలతో సీఎంశ్రీ కింద లైబ్రరీ, సైన్స్ ల్యాబ్ భవనాల నిర్మాణాన్ని పూర్తిచేసినట్లు వెల్లడించారు. విద్యార్థినుల సౌకర్యార్థం ఆధునిక వసతులతో కూడిన భవనాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. అనంతరం హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్సీ వీరారెడ్డి, జెడ్పీ సీఈఓ యాదయ్య, ఆర్‌అండ్‌బీ అధికారి దేశ్యా నాయక్ పాల్గొన్నారు.
చివరి బిల్లు ఎప్పుడో?
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎదురుచూపులు


