డిజిటలైజేషన్‌ను వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

డిజిటలైజేషన్‌ను వేగవంతం చేయాలి

Jul 12 2026 12:53 AM | Updated on Jul 12 2026 12:53 AM

వేగంగా భూముల రీ సర్వే..

వనపర్తి: ఎన్యూమరేషన్‌ ఫారాల డిజిటలైజేషన్‌ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి అధికారులను ఆదేశించారు. శనివారం ఆర్డీఓ కార్యాలయంతో పాటు పట్టణంలోని కేడీఆర్‌నగర్‌, చందాపూర్‌లో ఆకస్మికంగా పర్యటించి ఎన్యూమరేషన్‌ ఫారాల పంపిణీ, సేకరణ, డిజిటలైజేషన్‌ ప్రక్రియను పరిశీలించి బీఎల్వోలు, సూపర్‌వైజర్లకు కీలక సూచనలు చేశారు. ప్రతి బీఎల్వో రోజుకు కనీసం 100 ఫారాలను డిజిటలైజ్‌ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైతే వలంటీర్ల సాయం తీసుకొని ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. నింపిన ఫారాలను తప్పనిసరిగా సంబంధిత బీఎల్వోకు తిరిగి అందజేసేలా, లేనిపక్షంలో ఓటరు జాబితా నుంచి పేరు తొలగిపోయే ప్రమాదం ఉందని ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌ను తనిఖీ చేసి 2002 ఎస్‌ఐఆర్‌కు సంబంధించిన వివరాలను గుర్తించడంలో పూర్తి సహకారం అందించాలని సూచించారు. కేడీఆర్‌నగర్‌లో ఇప్పటి వరకు ఎన్యూమరేషన్‌ ఫారాలను పూర్తిస్థాయిలో పంపిణీ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులను నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఇంటికి వెళ్లి ఫారాలు అందజేసి సకాలంలో వాటిని సేకరించి డిజిటలైజేషన్‌ పూర్తి చేయాలని హెచ్చరించారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను నిర్దేశిత గడువులోగా నాణ్యతతో పూర్తి చేయాలని, ప్రతి అధికారి బాధ్యతగా పనిచేయాలన్నారు. కలెక్టర్‌ వెంట ఆర్డీఓ సుబ్రమణ్యం, తహసీల్దార్‌ రమేష్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

జిల్లాలో భూముల రీ సర్వే ప్రక్రియ వేగంగా పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి ఆదేశించారు. శనివారం రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఖమ్మం కలెక్టరేట్‌ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించగా.. జిల్లా నుంచి కలెక్టర్‌ పాల్గొని వివరాలు వెల్లడించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. రీ సర్వేకు లైసెనన్స్‌ సర్వేయర్ల సేవలు వినియోగించుకోవాలని.. వారికి సమాచారం చేరవేసి వచ్చేలా చూడాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ వినోద్‌కుమార్‌, సర్వే ఏడీ శ్రీనివాసులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement