వనపర్తి రూరల్: విశాల ఐక్య ప్రజా పోరాటాలతోనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని సీపీఐ రాష్ట్ర నాయకుడు మధుకర్ అన్నారు. జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో శనివారం రెండోరోజు జరిగిన పార్టీ ఉమ్మడి పాలమూరు జిల్లా రాజకీయ శిక్షణ తరగతులకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ‘మతోన్మాదం, లౌకిక వాదం, కేంద్రంలో అమలవుతున్న హిందుత్వ ఫాసిస్ట్ ఎజెండా’ అనే అంశంపై మాట్లాడారు. ప్రజల సంస్కృతి సాంప్రదాయాలపై కులం, మతం అంశాలు పెనవేసుకున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం తమ స్వలాభం కోసం దేశంలో విధ్వేష మత రాజకీయాలకు ఆజ్యం పోస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ పాలనలో దేశ ప్రజాస్వామ్య లౌకిక వ్యవస్థ ప్రమాద ఘంటికలు లెక్కిస్తుందన్నారు. దేశంలో ప్రజల మధ్య తీవ్రమైన ఆర్థిక వ్యత్యాసం పెరిగిపోయిందని, దేశసంపదను కొద్దిమంది అక్రమ పద్ధతుల్లో కొల్లగొడుతున్నారని ఆరోపించారు. పార్టీ సిద్ధాంతాలపై అచంచలమైన విశ్వాసం, అసమానతలకు వ్యతిరేకంగా ఉద్యమాలకు శ్రీకారం చుట్టాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రముఖ సైకాలజిస్ట్ డా. లక్ష్మణ్ పాల్గొని నాయకత్వ లక్షణాలు అనే అంశంపై వివరించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు బాలనర్సింహ, జిల్లా కార్యదర్శులు విజయరాములు, ఎస్‌ఎండీ ఫయాజ్, బాలకిషన్, ఆంజనేయులు, నర్సింహ, నాయకులు కేశవులుగౌడ్, కళావతమ్మ, రమేష్, సురేష్, గోపాలకృష్ణ, శ్రీరాములు, మోషా, భాస్కర్, కృష్ణవేణి, గీత, ఎండీ కుతుబ్ తదితరులు పాల్గొన్నారు.


