ఎడమ, కుడి కాల్వల్లో..
నీరు లేక వెలవెలబోతున్న సరళాసాగర్
● వానాకాలంలో వీడని జలగండం
● ముదురుతున్న నారుమడులు
● 9 గ్రామాలు.. 4,200 ఆయకట్టు
● కాల్వల్లో పారని జలం..
ఆందోళనలో ఆయకట్టు రైతులు
రెక్కల కష్టం నమ్మి అప్పు చేసి నారుమడి పోశా. కాల్వల్లో నీరు పారుతోందని పొలాన్ని దున్ని సిద్ధం చేశా. కాల్వలకు నీటిని ఎప్పుడు వదులుతారని అధికారులను అడిగితే ఇప్పుడు అప్పుడు అంటున్నారే తప్ప వదలడం లేదు. ఇంకొద్ది రోజులు నీరు రాకపోతే నారు ముదిరి పనికిరాకుండా పోతుంది. అధికారులు సత్వరమే స్పందించి మోటార్లు ప్రారంభించాలి.
– రాజ్‌కుమార్,
ఆయకట్టు రైతు, శంకరమ్మపేట
సరళాసాగర్ 4,200 ఎకరాల ఆయకట్టు ఉన్న జలాశయం. కాల్వల ద్వారా నీరు వస్తుందని 9 గ్రామాల ఆయకట్టు రైతులు బోరుబావుల కింద నారుమడులు పోశారు. జూరాల, రామనన్‌పాడు నిండే వరకు ఊరుకుంటే వానాకాలం సీజన్ దాటిపోతుంది. సమస్యను అధికారులకు విన్నవించినా స్పందించడం లేదు. కనీసం సమాధానం కూడా చెప్పడం లేదు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని రామన్‌పాడు మోటార్లు ప్రారంభించాలి.
– వంగూరు రామకృష్ణారెడ్డి, మదనాపురం
ఏటా జూలై కల్లా సాగునీరు పారేది. పైప్‌లైన్ పనులు పూర్తి కావడంతో రామన్‌పాడు జలాశయంలో ఉన్న కాస్త నీటినైనా పంటల సాగుకు అందించాలని అనుకున్నాం. రెండ్రోజుల్లో ప్రారంభిస్తాం.
– వెంకటయ్య,
చైర్మన్, సరళసాగర్ జలాశయం
మదనాపురం: వానాకాలం.. కాల్వల్లో వరద పారుతోందనే ఆశతో ఆయకట్టు రైతులు అప్పులు తెచ్చి చెమటోడ్చి వరి నారుమడులు పోశారు. సీజన్ ముగుస్తున్నా.. నేటికీ నీటి జాడ కనిపించకపోవడంతో ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితిలో ఆయకట్టు రైతులు ఉన్నారు. మండలంలోని చారిత్రాత్మక సరళసాగర్ జలాశయం ప్రస్తుతం నీరులేక వట్టిపోయి కనిపిస్తోంది. నారు ముదిరిపోతుండటంతో ఆయకట్టు పరిధిలోని 9 గ్రామాల రైతులు వరుణుడు ఎప్పుడు కరుణిస్తాడా.. కాల్వల్లో నీరు ఎప్పుడు పారుతుందా అనే ఆశతో ఎదురుచూస్తున్నారు.
కూలీలకు బతుకుదెరువు కరువు..
ఈ ఏడాది నీరు రాకపోతే సాగు విస్తీర్ణం పడిపోయి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతింటుంది. వేలాదిమంది వ్యవసాయ కూలీలకు పనులు కరవవుతాయి. కొంతకాలంగా సరళాసాగర్ ఆయకట్టుకు శాపంగా మారిన రైల్వేవంతెన కింద పైప్‌లైన్ పనులు రెండు, మూడురోజుల్లో పూర్తి చేయనున్నారు. ప్రతి ఏటా ఈ పాటికే ఎగువన కురిసే భారీ వర్షాలకు కృష్ణానది ఉరకలెత్తి జూరాల గేట్లు ఎత్తడంతో రామన్‌పాడు జలాశయం పూర్తిస్థాయిలో నిండేది. కానీ ఈసారి కృష్ణానదికి వరద రావడం ఆలస్యమైంది. రామన్‌పాడులో ఆశించిన మేర నీరు లేదని అధికారులు మోటార్లు ప్రారంభించడంలో జాప్యం చేస్తున్నారు. రైల్వేవంతెన కింద ఉన్న పైప్‌లైన్ పనులు తుది దిశకు చేరుకున్నాయి. కాల్వల ద్వారా నీటిని వదలడానికి అంతా సిద్ధంగా ఉన్నా.. రామన్‌పాడు జలాశయంలో ప్రస్తుతం ఉన్న నీటిమట్టం మోటార్లు నడపడానికి తగినంతగా లేదు. నీటిమట్టం పెరిగిన వెంటనే మోటార్లు ప్రారంభిస్తామని, సరళాసాగర్ ఆయకట్టుకు నీటిని వదులుతామని నీటిపారుదలశాఖ ఏఈ వరప్రసాద్ వివరించారు.
సరళాసాగర్ ఎడమ ఎడమ కాల్వ కింద శంకరమ్మపేట, దంతనూరు, మదనాపురం, తిర్మలాయపల్లి, వడ్డెవాట, అజ్జకొల్లు, రామన్‌పాడు గ్రామాల్లోని 3,800 ఎకరాలు, కుడి కాల్వ కింద కొన్నూరు, నర్సింగాపురం, నెల్విడి గ్రామాల్లోని 400 ఎకరాల ఆయకట్టు ఉండగా.. రైతులు పూర్తిగా వరి సాగు చేస్తారు. వ్యవసాయానికి జూన్, జూలై నెలలు అత్యంత కీలకమైనవి.. ఈ సమయంలో నీరు అందితేనే నాట్లు సకాలంలో పడి పంట కాలం సజావుగా సాగుతోంది. బోరుబావులున్న రైతులు ఉన్న నీటితో నారుమడలైతే సిద్ధం చేసుకున్నారు. ప్రధాన పొలాల్లో నాట్లు వేయాలంటే భారీగా నీరు అవసరం.. కాల్వల్లో నీరు పారకపోతే పోసిన నారుమడ లు ఎండిపోయి పెట్టుబడి నష్టపోవాల్సి వస్తుంది.


