● అమరచింతలో 88, కొత్తకోటలో
90 శాతం ఓటింగ్ నమోదు
● ఓటేసేందుకు ఇతర గ్రామాల నుండి
తరలొచ్చిన నేతన్నలు
● సీఐ నేతృత్వంలో బందోబస్తు
అమరచింత: జిల్లాలోని అమరచింత, కొత్తకోటలో శుక్రవారం జరిగిన చేనేత సహకార సంఘం ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. అమరచింత చేనేత సహకార సంఘం పరిధిలో అమరచింత, తిప్పడంపల్లి, చిన్నచింతకుంట, లాల్‌కోట, ముచ్చింతల గ్రామాలు ఉండగా.. ఆయా గ్రామాల చేనేత కార్మికులు పట్టణంలోని పోలింగ్ కేంద్రానికి వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ కొనసాగగా.. ఓటర్లు వరుసలో నిలబడి తమ ఓటు వేశారు. అమరచింతలో ఎన్నికల అధికారి ప్రసాదరావు ప్రొసీడింగ్ అధికారులకు సూచనలిస్తు ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. మొత్తం 762 మంది ఓటర్లుండగా.. 676 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. వృద్ధులు, నడవలేని స్థితిలో ఉన్నవారు సైతం వచ్చిన ఓటు వేశారు. అమరచింతలో 88 శాతం పోలింగ్ జరిగినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. మధ్యాహ్నం 2 నుంచి ఓట్ల లెక్కింపు మొదలైంది.
సమయం ఇవ్వాలంటూ వాగ్వాదం..
మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ కొనసాగుతుందని ఎన్నికల అధికారులు ప్రకటించిన విషయం తెలిసినా.. మధ్యాహ్నం రెండు వరకు అని సమాచారం ఇచ్చారని, దీంతో చాలామంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోలేక పోయారంటూ ఎస్‌ఐ స్వాతితో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు వాగ్వాదానికి దిగారు. హైదరాబాద్, వనపర్తి నుంచి ఓటర్లు వచ్చారని.. సమయం లేదని పోలింగ్ నిలిపివేయడం ఏమిటని ఆందోళనకు దిగారు. దీంతో కేంద్రం వద్ద కొంత సమయం ఉద్రిక్తత నెలకొంది. ఎస్‌ఐ జోక్యం చేసుకుని ఎన్నికల అధికారిని బయటకు పిలిపించి ఎన్నికల సమయం చెప్పించడంతో ఆందోళన సద్దుమణిగింది.
కొత్తకోట చేనేత సహకార సంఘంలో 76 మందికి ఓటు హక్కు ఉండగా.. 62 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 2 నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతలను ప్రకటించినట్లు ఎన్నికల అధికారి మహబూబ్ అలీ తెలిపారు. ప్రశాంతకర వాతావారణంలో ఎన్నికలు జరిగాయని వెల్లడించారు.


