బీఆర్‌ఎస్‌ నేతల మాటలు హాస్యాస్పదం | - | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ నేతల మాటలు హాస్యాస్పదం

Jul 11 2026 12:30 AM | Updated on Jul 11 2026 12:30 AM

ముందు చెల్లి ప్రశ్నలకు సమాధానం చెప్పు..

నేను లోకల్‌.. ఎవరినీ మోసం

చేయలేదు

వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

వనపర్తి: ‘నాగర్‌కర్నూల్‌ ప్రాంతంలో పుట్టి పాన్‌గల్‌లో పెరిగి వనపర్తిలో రాజకీయం చేసే వాళ్లు నన్ను విమర్శిస్తే ప్రయోజనం శూన్యమే.. నియోజకవర్గంలో పుట్టి పెరిగాను నేను లోకల్‌.. ఇక్కడే రాజకీయం చేస్తున్నా’ అంటూ వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రతిపక్షనేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మాజీ మంత్రి మల్లారెడ్డి తరహాలో పాలు పిండినా.. టిప్పర్‌ నడిపినా.. వ్యవసాయం చేశా.. కానీ ఎవరినీ మోసం చేయలేదంటూ సంచలన వాఖ్యలు చేశారు. శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సీఎంఆర్‌ఎఫ్‌, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కుల పంపిణీలో మునుపెన్నడూ లేని విధంగా ప్రతిపక్షాలపై మాటల దాడి చేశారు. కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయం, రోడ్ల విస్తరణ కొంత భాగం, వైద్య, వ్యవసాయ కళాశాలలు బీఆర్‌ఎస్‌ హయాంలోనే చేపట్టారు.. అంతమాత్రాన గడిచిన 28 నెలల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేయలేదని నిత్యం మీడియా ముందు మాట్లాడటం సరికాదన్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గ అభివృద్ధికి రూ.2,147 కోట్లు తీసుకొచ్చామని.. వివరాలు కావాలంటే చర్చకు వస్తే జీఓలు చూపిస్తామని బదులిచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే పెబ్బేరు, శ్రీరంగాపూర్‌ తదితర ప్రాంతాల్లో 55 వేల ఎకరాలకు భీమా, జూరాల కాల్వలతో సాగునీరందించిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఉందని.. కానాయపల్లి వద్ద రింగ్‌బండ్‌, అల్లీపూర్‌ గేట్‌ వద్ద గండికొట్టి నీళ్లు మలిపి తామే సాగునీటి కాల్వల రూపకర్తలమని గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు 13,167 మంది లబ్ధిదారులకు రూ.79.89 కోట్ల ఆర్థిక సాయాన్ని 17 విడతలుగా అందించామన్నారు.

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సొంత చెల్లి కవిత అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్ప చేతగాదుగాని.. సీఎం రేవంత్‌రెడ్డిని విమర్శించేందుకు ఒంటికాలుపై నిలబడటం హాస్యాస్పదంగా ఉందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ అకౌంట్‌లో ఉన్న రూ.1,400 కోట్ల లెక్క చెప్పాలని డిమాండ్‌ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి రాజకీయాల్లో ఉన్నంత వరకు ఆయన్ను ఓడించే దమ్ము బీఆర్‌ఎస్‌, బీజేపీకి లేవన్నారు. ప్రతిపక్ష హోదాలో ఉన్న వారు హుందాగా వ్యవహరించాలని, నిత్యం బూతు పురాణం వినిపిస్తే.. ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకోలేరని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement