వనపర్తి: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను నిర్దేశిత గడువులోగా నాణ్యతతో పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యం చేస్తే వేటు తప్పదని కలెక్టర్ ఆదర్శ్ సురభి హెచ్చరించారు. శుక్రవారం తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మండలస్థాయి అధికారులు, బీఎల్వోలతో వీడియో కాన్ఫరెనన్స్ నిర్వహించి ఎస్‌ఐఆర్ పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేవలం 15 రోజుల గడువు మిగిలి ఉండగా ఇప్పటి వరకు కేవలం 24 శాతమే డిజిటలైజేషన్ పూర్తయిందన్నారు. ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ, డిజిటలైజేషన్ వేగాన్ని మరింత పెంచి నిర్దేశిత లక్ష్యాలను తప్పనిసరిగా సాధించాలని కోరారు. బీఎల్వోలకు గ్రామపంచాయతీ కార్యదర్శులు, పంచాయతీ సిబ్బంది, ఇతర శాఖల సిబ్బంది పూర్తిస్థాయిలో సహకరించాలని, ప్రతి పోలింగ్ కేంద్రానికి 3 వలంటీర్లను నియమించి ఫారాల సేకరణ, డిజిటలైజేషన్ వేగవంతం చేయాలన్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలు పాటిస్తూ ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తగా పని చేయాలని, అలసత్వం ప్రదర్శిస్తే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రానున్న 15 రోజులు ఎస్‌ఐఆర్ పనులకే ప్రాధాన్యత ఇవ్వాలని, తహసీల్దార్ అనుమతి లేకుండా ఎవరూ సెలవులు తీసుకోవద్దని సూచించారు. ప్రతి గ్రామపంచాయతీ కార్యాలయంలో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేసి ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు పూరించడంలో అవసరమైన సాయం అందించాలని, రోజూ 100 ఫారాల డిజిటలైజేషన్ లక్ష్యంగా పనిచేస్తూ 20వ తేదీలోగా పూర్తి చేయాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, జెడ్పీ సీఈఓ యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, డీఆర్డీఓ ఉమాదేవి, జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి తదితరులు పాల్గొన్నారు.


