వనపర్తి: పనితీరే ప్రజల విశ్వాసానికి పునాది.. రికార్డుల నిర్వహణ, కేసుల దర్యాప్తు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో పారదర్శకత, నాణ్యత ఉంటేనే పోలీసుశాఖపై ప్రజల నమ్మకం మరింత పెరుగుతుందని ఎస్పీ డి.సునీతారెడ్డి అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం ఆమె వనపర్తి సర్కిల్ కార్యాలయాన్ని ఆమె సందర్శించగా డీఎస్పీ గిరిబాబు, సీఐ సుగంధ రత్నం పూల మొక్క అందజేసి స్వాగతం పలికారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించి కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి సర్కిల్ పరిధిలో ఎక్కువగా జరుగుతున్న నేరాలు, పెండింగ్ కేసులు, దర్యాప్తు వివరాలను సీఐని అడిగి తెలుసుకున్నారు. ప్రతి రికార్డును నిబంధనలకు అనుగుణంగా నవీకరిస్తూ కేసుల దర్యాప్తును నాణ్యతతో నిర్దిష్ట కాలవ్యవధిలో పూర్తి చేయాలని సూచించారు. ప్రజల నుంచి అందిన ప్రతి ఫిర్యాదును బాధ్యతగా స్వీకరించి పారదర్శకంగా విచారణ జరిపి త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ప్రభుత్వ ఆస్తుల సంరక్షణ, కార్యాలయ పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, డిజిటల్ నమోదు, సిబ్బంది క్రమశిక్షణ వంటి అంశాల్లో నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని.. ప్రజలతో స్నేహపూర్వకంగా, మర్యాదగా వ్యవహరిస్తూ సేవలు అందించాలని సూచించారు. ఎస్పీ వెంట డీసీఆర్బీ ఎస్‌ఐ శివకుమార్, సర్కిల్ ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది తదితరులు ఉన్నారు.


