నేరుగా ఖాతాలో జమచేయాలి..
కొనుగోలు కేంద్రాల నుంచి సొంత వాహనాల్లో ధాన్యం తరలింపు
● అద్దె కోసం రవాణా కాంట్రాక్టర్లను
ఆశ్రయించాల్సిందే..
● గతంలో వెచ్చించిన డబ్బులు
ఇచ్చినట్లేనా..?
● జిల్లాలో 9 రూట్లు.. నిత్యం 360 లారీలు అందుబాటులో...
పదిరోజుల కిందట 314 బస్తాల వరి ధాన్యాన్ని వీపనగండ్ల గోదాంకు ట్రాక్టర్లలో తరలించాం. బస్తాకు రూ.9 చొప్పున కాంట్రాక్టర్ ఇస్తామన్నారు. డబ్బుల కోసం వెళ్తే.. ఇంకా బిల్లు రాలేదని తర్వాత ఇస్తామంటున్నారు. అద్దె చెల్లించాలని ట్రాక్టర్ల యజమానులు వత్తిడి తెస్తున్నారు. అధికారులు స్పందించి వెంటనే రవాణా డబ్బులు ఇప్పించాలి. – కురుమయ్య,
రైతు, గోపల్‌దిన్నె (వీపనగండ్ల)
నేను దొడ్డురకం వరి పండించా. వారం కిందట సంచికి రూ.పది చొప్పున 270 సంచులు రెండు ట్రాక్టర్లలో గోపాల్‌పేట గోదాంకు తరలించాను. అప్పు చేసి రూ.ఐదు వేలు అద్దె చెల్లించాను. ధాన్యం తరలించిన డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియదు. అధికారులు త్వరగా చెల్లించేలా చూడాలి.
– బాషమోని శేఖర్, రైతు, ఏదుట్ల
రైతులు ధాన్యం మిల్లుల వద్ద దించగానే వే బ్రిడ్జి రసీదు, మిల్లర్ ధాన్యం తీసుకున్నట్లుగా ఇచ్చిన రసీదు ట్రాన్‌పోర్టు కాంట్రాక్టర్‌కు చూపిస్తే వెంటనే డబ్బులు ఇవ్వమని ఆదేశాలిచ్చాం. ఎక్కడైనా లోపాలుంటే పరిశీలించి కాంట్రాక్టర్లతో వెంటనే రైతులకు అద్దె డబ్బులు ఇప్పిస్తాం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే మా దృష్టికి తీసుకురావాలి.
– వినోద్‌కుమార్, రెవెన్యూ అదనపు కలెక్టర్
వనపర్తి: అన్నదాతలు ఆరుగాలం శ్రమించి పండించిన పంట ఉత్పత్తులను అమ్ముకొనేందుకు అష్టకష్టాలు పడటంతో పాటు ఆర్థిక భారం తప్పడం లేదు. జిల్లావ్యాప్తంగా ఒకేసారి ధాన్యం విక్రయాలు పుంజుకోవడంతో సకాలంలో తూకాలు, తరలింపు అసాధ్యంగా మారింది. ధాన్యం మిల్లులు, గోదాములకు తరలించేందుకు సరిపడా వాహనాలను రవాణా కాంట్రాక్టర్లు సమకూర్చడం లేదు. రైతులే తమ సొంత, అద్దె వాహనాల్లో ధాన్యాన్ని మిల్లులకు తరలించి అన్‌లోడ్ చేసిన వెంటనే మిల్లర్లు ఇచ్చిన రసీదు, వేబ్రిడ్జి రసీదును కాంట్రాక్టర్‌కు చూపిస్తే వెంటనే డబ్బులు చెల్లించాలని రవాణా కాంట్రాక్టర్లకు అధికారులు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. తమకు ఇంకా బిల్లులు రాలేదంటూ.. కొందరు కాంట్రాక్టర్లు రైతులకు వాహనాల అద్దె చెల్లించడం లేదు. గతేడాది కూడా ఇలాంటి పరిస్థితుల్లో రైతులు నెలల తరబడి సదరు కాంట్రాక్టర్ల చుట్టూ తిరిగి వాహనాల అద్దె డబ్బులను వసూలు చేసుకున్న ఘటనలు లేకపోలేదు. ప్రస్తుత సీజన్‌లో అకాల వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలను ఉంచలేక రైతులు సొంత, అద్దె వాహనాల్లో మిల్లులకు ధాన్యం తరలిస్తున్నారు. కొనుగోలు కేంద్రం నుంచి మిల్లులున్న దూరం ఆధారంగా బస్తాకు రూ.8 నుంచి రూ.10 వరకు వాహనదారులు డబ్బులు వసూలు చేస్తున్నారు. కాగా రవాణా కాంట్రాక్టర్లు చెల్లింపుల విషయంలో రైతులు, అద్దె వాహనాలు సమకూర్చిన వారిని పలుమార్లు అడిగించుకుంటున్నారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
మంత్రి జూపల్లి ఇలాకాలోని వీపనగండ్ల మండలంలో ఉన్న గోవర్ధనగిరి కొనుగోలు కేంద్రం నుంచి 16, గోపల్‌దిన్నె నుంచి 10, కల్వరాల నుంచి 12, వీపనగండ్ల కొనుగోలు కేంద్రం నుంచి 20 ప్రైవేట్ వాహనాల్లో రైతులు తమ ధాన్యాన్ని గోదాంకు తరలించారు. పదిరోజులు గడుస్తున్నా.. నేటికీ రవాణా కాంట్రాక్టర్ డబ్బులు చెల్లించలేదు. డబ్బులు అడిగితే తనకే ఇంకా బిల్లు రాలేదంటూ చెబుతున్నారని రైతులు వెల్లడించారు.
కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం బస్తాలు తరలించేందుకు సకాలంలో లారీలు రావడం లేదు. చేసేది లేక గ్రామాల్లోని ట్రాక్టర్లలో మిల్లులకు తరలించాం. ధాన్యం బస్తాలను మేము తరలిస్తే అద్దె రవాణా కాంట్రాక్టర్ ఖాతాలో జమ చేస్తున్నారు. దీంతో మేము చాలా నష్టపోతున్నాం. రైతు ఖాతాలో అద్దె జమ చేయడంతో ఎలాంటి ఇబ్బంది ఉండదు.
– బంగి నర్సింహ,
అప్పారెడ్డిపల్లి, ఖిల్లాఘనపురం


