తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి

May 28 2026 3:10 AM | Updated on May 28 2026 3:10 AM

ఖిల్లాఘనపురం/వనపర్తి రూరల్‌: ప్రతిసారి సమావేశాల్లో పెద్ద జీతగాడిలా పని చేస్తామంటూ చెప్పుకొనే వారికి ఇప్పుడు రైతుల కష్టాలు కనిపించడం లేదా అని మాజీ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. బుధవారం తెల్లవారుజామున కురిసిన అకాల వర్షానికి ఖిల్లాఘనపురం మండలంలోని ఉప్పరిపల్లి, మల్కాపురం, గట్టుకాడిపల్లి, పెబ్బేరు మండలం గుమ్మడం, సూగూరు, రంగాపురం, పెబ్బేరులోని కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని పరిశీలించి మాట్లాడారు. ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షానికి తడిసిందని, ఆ ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను కొనుగోలు చేయకపోవడంతో రైతులు కేంద్రాల వద్ద పడిగాపులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ అధికారుల లెక్కల ప్రకారం రాష్ట్రంలో యాసంగిలో 65.42 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా.. 90 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం, అధికార పార్టీ నాయకులు ఎందుకు రైతులను మోసగిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం చెప్పిన 90 లక్షల మెట్రిక్‌ టన్నుల్లో ఇప్పటి వరకు 42 శాతం మాత్రమే కొనుగోలు చేశారని.. రవాణా ఏజెన్సీల నిర్లక్ష్యంతో రైతులు అరిగోస పడుతున్నారని చెప్పారు. గన్నీబ్యాగులుంటే లారీలు రావు.. లారీలు వస్తే గన్నీబ్యాగుల కొరగ.. రెండూ ఉంటే హమాలీలు రావడం లేదని ఎద్దేవా చేశారు. రైతులు పంటలు పండించడానికి పడిన కష్టం కంటే ధాన్యం అమ్ముకోవడానికి ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లారీలు, ట్రక్కులు లేని వారికి రవాణా ఏజెన్సీ ఎలా ఇచ్చారో ప్రభుత్వానికి, అధికార పార్టీ నాయకులకు తెలియాలన్నారు, ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. తరుగు పేరిట ధాన్యంలో కోతలు విధించినా పట్టించుకునే వారు కరువయ్యారని.. అకాల వర్షానికి తడిసిన, మొలకెత్తిన ధాన్యం పూ స్థాయిలో మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. గ్రామాల్లో ఉన్న రైతువేదికలను ధాన్యం నిల్వలకు వినియోగించాలని సూచించారు. అనంతరం గట్టుకాడిపల్లి శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement