వనపర్తి: ఆరోగ్యశ్రీ అనుమతి రాలేదనే నెపంతో రోగులకు అత్యవసర వైద్యసేవలు ఆపొద్దని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కోరారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశానికి ఆయనతో పాటు కలెక్టర్ ఆదర్శ్ సురభి హాజరయ్యారు. ఈ సందర్భంగా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, ఎంసీహెచ్‌లో ప్రస్తుతం అందిస్తున్న సేవలను వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏడాది కాలంగా ఆయా ఆస్పత్రుల్లో నమోదైన ఓపీడీ, ఐపీడీ, రెఫరల్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. 2025, జనవరి నుంచి 2025, డిసెంబర్ వరకు మొత్తం 3.65 లక్షల ఓపీడీ, 33 వేల ఐపీడీ కేసులు నమోదైనట్లు సూపరింటెండెంట్ వివరించారు. నెలకు సగటున 90 నుంచి 150 కేసులను మహబూబ్‌నగర్ ఆస్పత్రికి రెఫర్ చేస్తున్నట్లు తెలిపారు. అత్యవసర కేసులను ఇతర ప్రాంతాలకు పంపించకుండా ఉండేందుకు కావాల్సిన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని, అందుకోసం ఏమేం అవసరం ఉన్నాయో నివేదిక అందించాలని అధికారులను కోరారు. వైద్యుల నివేదిక ప్రకారం ఆస్పత్రులకు కావాల్సిన సామగ్రిని కొనుగోలు చేయడానికి అవకాశం ఉందన్నారు. ఆరోగ్యశ్రీ అనుమతి రాలేదనే పేరుతో రోగులకు అత్యవసర వైద్యసేవలు నిలపొద్దని.. రోగులకు కనీస మౌలిక వసతులు కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా పెబ్బేరులో ఆస్పత్రి నిర్మాణ పనులు వేగవంతం చేయాలన్నారు. ఖిల్లాఘనపురం ప్రభుత్వ ఆస్పత్రికి అంబులెన్స్ సౌకర్యం కల్పించేందుకు అధికారులకు తగిన సూచనలు చేశారు. రాత్రిళ్లు ఆస్పత్రుల్లో సీనియర్ వైద్యులు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య మెరుగ్గా ఉందని, చిన్నపిల్లల వైద్యం, కంటి చికిత్సకు సంబంధించిన విభాగాల్లో వైద్యశాఖ పనితీరు బాగుందని ఎమ్మెల్యే అభినందించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జీజీహెచ్, ఎంసీహెచ్‌లో సౌకర్యాల కల్పనకు సంబంధిత విభాగాల హెచ్‌ఓడీలు కలిసి నివేదిక రూపొందించి సమర్పించాలని ఆదేశించారు. ఆస్పత్రిలోని వివిధ విభాగాల్లో సిబ్బంది కొరత ఉందని అధికారులు ప్రస్తావించగా ఔట్‌సోర్సింగ్ వారితో సర్దుబాటు చేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా వైద్యాధికారి డా. సాయినాథ్‌రెడ్డి, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ మల్లికార్జున్, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్, ఆర్‌ఎంఓ రెడ్డి కుమారి, ఐఎంఏ అధ్యక్షుడు, మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్‌గౌడ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి


