వనపర్తి: ప్రజావాణి ఫిర్యాదులు, అర్జీలను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణికి ఆయనతో పాటు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్, ఆర్డీఓ సుబ్రమణ్యం, జెడ్పీ సీఈఓ యాదయ్య హాజరై అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యత అధికారులపై ఉందన్నారు. దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీఎం, జిల్లా మంత్రి ప్రజావాణి నుంచి వచ్చిన, పెండింగ్ అర్జీలను సైతం వారంలో పరిష్కరించాలన్నారు. ప్రజావాణికి 40 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తెలిపారు. కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.


