వనపర్తిటౌన్: కేంద్రీయ విద్యాలయ (కేవీ స్కూల్) తరగతులు ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. సోమవారం జిల్లా విద్యాధికారి కార్యాలయంలో డీఈఓ అబ్దుల్ ఘనీ అధ్యక్షతన కేవీ ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ దశరథరామ్‌తో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి తరగతికి 40 మంది విద్యార్థులను ఎంపిక చేస్తామని, బాలవాటిక విద్యార్థులకు ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, 1వ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 2.40 వరకు తరగతులు కొనసాగుతాయని వివరించారు. అన్ని తరగతి గదులు ఉన్నాయని.. తాగునీరు, టాయిలెట్ల ఏర్పాటును కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించామని చెప్పారు. బాలవాటిక–1 నుంచి 1వ తరగతి వరకు మొత్తం 4 నాలుగు తరగతులకు ఆన్‌లైన్‌లో 5,188 దరఖాస్తులు, 2వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ప్రత్యక్ష దరఖాస్తు విధానంలో 1,029 దరఖాస్తులు వచ్చాయని వివరించారు. విద్యార్థుల ఎంపిక ఆన్‌లైన్, లాటరీ పద్ధతిలో కొనసాగనుందని.. 8వ తేదీన బాలవాటిక–1 నుంచి బాలవాటిక–3 వరకు, 9వ తేదీన 1వ తరగతి, 10న 2వ తరగతి నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులను ఎంపిక చేస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, సెంట్రల్ అటానమస్ పిల్లలకు తొలి ప్రాధాన్యం ఉంటుందని, 2వ దశలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, 3వ దశలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, 4వ దశలో ఆర్టీసీ, విద్యుత్ ఉద్యోగుల పిల్లలు, 5వ దశలో ఇతరులకు అవకాశం ఉంటుందన్నారు. లాటరీ విధానంలో ఎంపికలు కేవీ స్కూల్ మార్గదర్శకాలకు అనుగుణంగా నియమించిన కమిటీ ఉంటుందని, ఈ కమిటీలో వీఎంసీ సభ్యుడు, ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గానికి చెందిన ఒక మహిళా ఉపాధ్యాయురాలితో కలిపి ఐదుగురు సభ్యులు ఉంటారని వివరించారు. సమీక్షలో ఏఎంఓ మహానంది, డీఎస్‌ఓ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.


