రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేసింది. పేద ప్రజల కోసం ఇందిరమ్మ జీవిత బీమా పథకం ఏర్పాటు చేయడం శుభ పరిణామం. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలనేదే ప్రభుత్వ లక్ష్యం.
– వాకిటి శ్రీహరి, రాష్ట్ర పశుసంవర్దకశాఖ మంత్రి
రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించేలా ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క శుక్రవారం అసెంబ్లీలో ప్రజామోద బడ్జెట్ ప్రవేశపెట్టారు. వ్యవసాయం, మహిళల అభ్యున్నతి, విద్య, యువతపై ప్రత్యేక దృష్టి సారించి నిధుల కేటాయింపులు చేశారు. ఎస్సీకాలనీల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించిన ఘనత రేవంత్‌రెడ్డి సర్కారుకే దక్కింది. విద్యావ్యవస్థలో మార్పులు, ఆధునిక కిచెన్లు, విద్యార్థులకు అందించే మెనూలో వారంలో మూడురోజులు పాలు అందించేలా తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.
– తూడి మేఘారెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం బడ్జెట్‌లో క్రీడలకు గతంలో ఎప్పుడూ లేనంతగా రూ.500 కోట్లు కేటాయించడం హర్షణీయం. కొన్నేళ్లుగా నిర్లక్ష్యానికి గురవుతున్న గ్రామీణ క్రీడలకు పూర్వ వైభవం తీసుకొచ్చేలా ప్రోత్సహిస్తూ నిధులు కేటాయించారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో గ్రామీణ క్రీడాకారులు సత్తా చాటేలా క్రీడారంగం బలోపేతానికి పెద్దపీట వేశారు. – శివసేనారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు
రాష్ట్ర బడ్జెట్‌లో సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు రూ.వేల కోట్ల నిధులు కేటాయిస్తున్నట్టు చూపుతున్నారు. అయితే ఖర్చులో మాత్రం తేడా ఉంటోంది. ఎంత కేటాయించారన్నది కాకుండా ఎంత ఖర్చు చేశారో ముఖ్యం. ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టుల కోసం సిద్ధం చేసిన డీపీఆర్‌లకు అనుగుణంగా సాగునీరు అందించాలి. ఇప్పటివరకు ఎన్ని ఎకరాలకు అందించారు.. నీరు అందించకుండా పెండింగ్ ఉన్న భూములకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి. అంకెల గారడీ కాదు.. నీళ్లు కావాలి.
– రాఘవాచారి, కన్వీనర్, పాలమూరు అధ్యయన వేదిక
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీగా ఉంది. అప్పుల పద్దులను చూస్తేనే ప్రజలకు వణుకు పుట్టేలా బడ్జెట్‌లో రాబడి, ఖర్చు లెక్కలు ఉన్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులకు ఏటా రూ.వేల కోట్లలో రాష్ట్ర ప్రజానికం వడ్డీలు చెల్లించడం శోచనీయం. భారత ప్రభుత్వం నిర్వహించే ప్రజాపంపిణీ, గృహ నిర్మాణంలో రాష్ట్ర వాటా కొద్దిపాటి మాత్రమే. బడ్జెట్‌లో ఈ రెండు శాఖలకు కేటాయించిన పద్దులతో ఈ విషయం మరోసారి స్పష్టమవుతోంది. – డి.నారాయణ,
బీజేపీ జిల్లా అధ్యక్షుడు
రైతుల పంట రుణమాఫీ పూర్తిస్థాయిలో చేపడతామని అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పాలకులు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక కంటితుడుపు చర్యగా కొద్దిపాటి మాఫీచేసి అగ్రభాగం విషయంలో నిర్లక్ష్యం వహిస్తోంది. బడ్జెట్‌లో ఈ విషయంపై ప్రస్తావనగాని, నిధుల కేటాయింపులు చేయకపోవడం శోచనీయం.
– గట్టుయాదవ్, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు
●


