వనపర్తి: ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు, వైద్యులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు సత్వర చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఎంఐడీసీ ఇంజినీర్లను ఆదేశించారు. మంగళవారం ఉదయం జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ సాయినాథ్‌రెడ్డి, ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అరుణ, మాతా శిశు సంరక్షణ కేంద్రం సూపరింటెండెంట్‌తో కలిసి కలెక్టర్ ప్రభుత్వ ఆస్పత్రిలో రూ.కోటి నిధులతో కొత్తగా ఏర్పాటు చేయనున్న సిటీ స్కాన్ సెంటర్, సదరం క్యాంపు కేంద్రాల్లో చేపడుతున్న పనుల పురోగతిని పరిశీలించారు. వీటితో పాటు ఆస్పత్రికి అవసరమైన వీల్ చైర్లు, బీపీ కొలిచే మిషన్లు ఇతర మౌలిక సదుపాయాలు సమకూర్చుకోడానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి సమర్పించాలన్నారు. ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభోత్సవం చేసుకునే విధంగా సిటీ స్కాన్, సదరం క్యాంపు గదుల నిర్మాణం త్వరగా పూర్తి చేసి, యంత్ర సామగ్రికి వెంటనే ఆర్డరు పెట్టాలన్నారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సందర్శించారు. అంతకముందు కలెక్టర్ సీబీపీ, హెచ్‌బీ 1 రక్త పరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమంలో డాక్టర్ పరిమళ, ఇతర వైద్య సిబ్బంది తదితరులున్నారు.
క్షయ వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం
ఆరు నెలలు క్రమం తప్పకుండా మందులు వాడుతూ పౌష్టికాహారం తీసుకుంటే క్షయ వ్యాధి పూర్తిగా నయమైపోతుందని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. ప్రపంచ క్షయ వ్యాధి నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో స్థానిక టీబీ నివారణ కేంద్రంలో కలెక్టర్ వంద రోజుల క్యాంపెయిన్ వాహనానికి జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రమేష్‌రెడ్డి వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు


