వనపర్తి: ఐరాడ్ (ఇంటిగ్రేటెడ్ రోడ్డు యాక్సిడెంట్ డాటా బేస్) అప్లికేషన్ ద్వారా రోడ్డు ప్రమాదాల నివారణకు సత్వర చర్యలు చేపట్టాలని ఎస్పీ సునీతారెడ్డి తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయం సమావేశ భవనంలో ఎస్పీ ఆధ్వర్యంలో జిల్లాలోని ఎస్‌ఐలకు, రైటర్లకు ఐరాడ్ అప్లికేషన్‌పై ఒకరోజు శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో ఐరాడ్ అప్లికేషన్ ద్వారా రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వివరాలను సక్రమంగా నమోదు చేయడం, ప్రమాద స్థలాలను ఖచ్చితంగా గుర్తించడం, డేటా విశ్లేషణ ద్వారా ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టే విధానాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగాఎస్పీ మాట్లాడుతూ ప్రతి రోడ్డు ప్రమాదం వెనుక ఉన్న కారణాలను సాంకేతికత ద్వారా గుర్తించడం అత్యంత అవసరమన్నారు. రోడ్డు ప్రమాదాలపై ఖచ్చితమైన సమాచారం సేకరణలో ఐరాడ్ అప్లికేషన్ కీలక పాత్ర పోషిస్తుందని, ప్రతి ప్రమాదాన్ని సమగ్రంగా నమోదు చేయడం ద్వారా భవిష్యత్‌లో ప్రమాదాలు తగ్గించే చర్యలు తీసుకోవడం సులభమవుతుందన్నారు. బాధితులకు ప్రభుత్వం అందించే బీమా ప్రయోజనాలు, చికిత్స అవకాశాలు గురించి పోలీస్ అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వరరావు, డీసీఆర్‌బీ డీఎస్పీ బాలాజీనాయక్, డీసీఐఆర్‌బీ ఎస్‌ఐ తిరుపతిరెడ్డి, జిల్లాలోని ఎస్‌ఐలు, పోలీస్‌స్టేషన్ల సీసీటీ ఎన్‌ఎస్ రైటర్లు తదితరులు పాల్గొన్నారు.


