వనపర్తిటౌన్: ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీల అమలు జాడే కనిపించడం లేదని, 6 గ్యారెంటీలు వెంటనే అమలు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డి.నారాయణ డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్రశాఖ పిలుపు మేరకు శుక్రవారం పార్టీ నాయకులు, కార్యకర్తలు కలెక్టరేట్‌ను ముట్టడించి గేటు ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పార్టీని గెలిపిస్తే రైతులు, కౌలు రైతులకు రైతుభరోసా రూ.15 వేలు, వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు, ఏకకాలంలో రూ.2 లక్షల పంట రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రస్తుతం చేతులెత్తేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు నెలకు రూ.2,500, ఆసరా పింఛన్ పెంపు, కల్యాణలక్ష్మి పథకంలో రూ.లక్షతో పాటు తులం బంగారం జాడేదని ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్, బీసీ డిక్లరేషన్ పేరుతో మోసం చేశారని నిప్పులు చెరిగారు. అనంతరం కలెక్టరేట్ సూపరింటెండెంట్‌కు మెమోరాండం అందజేశారు. పురుషోత్తంరెడ్డి, పెద్దిరాజు, శ్రీనివాస్‌గౌడ్, వారణాసి కల్పన, సుమిత్రమ్మ, ఆర్.వెంకటేశ్వర్‌రెడ్డి, బచ్చు రాము, బోయల రాము, ఉపాధ్యక్షుడు రాఘవేందర్ గౌడ్, కోశాధికారి బండారు కుమారస్వామి, కౌన్సిలర్ విజయసాగర్ పాల్గొన్నారు.


