వ్యవసాయ రంగానికి పెద్దపీట
● రైతులు సేంద్రియ ఎరువులపై
దృష్టిసారించాలి
● రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్
కోదండరెడ్డి
వంగూరు/చారకొండ: వ్యవసాయ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసి.. రైతులకు అండగా నిలుస్తోందని రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అన్నారు. గురువారం వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో ఏర్పాటుచేసిన రైతు అవగాహన సదస్సుకు రైతు కమిషన్ సభ్యులతో పాటు కలెక్టర్ బదావత్ సంతోష్, అచ్చంపేట ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ కోదండరెడ్డి మాట్లాడుతూ.. రైతులు తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందే విధంగా వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రైతులు పంటల సాగులో రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించి.. సేంద్రియ ఎరువుల వాడకంపై దృష్టిసారించాలన్నారు. తద్వారా రైతులకు అధిక దిగుబడులు వస్తాయన్నారు. గతంలో భూసార పరీక్షలు చేయించుకునేందుకు అవసరమైన పరికరాలు అందుబాటులో ఉండేవి కావని.. ప్రస్తుతం భూ సారం, ఎరువుల వాడకం తదితర అంశాలను తెలుసుకునేందుకు నేరుగా రైతులకే భూసార పరీక్షల కిట్లు అందిస్తున్నట్లు చెప్పారు. రైతులు భూ సారానికి అనుగుణంగా పంటమార్పిడి విధానం పాటించాలని సూచించారు. అనంతరం పలువురు రైతులకు భూసార పరీక్ష కిట్లను పంపిణీ చేశారు. అదే విధంగా చారకొండ మండలం జూపల్లి శివారులో రైతు రంగప్రసాద్ వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియ పద్ధతిలో సాగుచేస్తున్న పంటలను రైతు కమిషన్ సభ్యులు రాములునాయక్, ఎం.సునీల్‌కుమార్, రాంరెడ్డి, గోపాల్‌రెడ్డి, గంగాధర్, కేవీఎన్ రెడ్డి, చెవిటి వెంకన్న యాదవ్, మరికంటి భవానితో కలిసి చైర్మన్ కోదండరెడ్డి పరిశీలించారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ అదనపు సంచాలకులు సుచిత్ర, అడిషనల్ డైరెక్టర్ సంధ్యారాణి, డీఏఓ యశ్వంత్‌రావు, ఆర్డీఓ జనార్దన్‌రెడ్డి, వ్యవసాయ శాస్త్రవేత్తలు భజేంద్ర, డా.రాంప్రసాద్, జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ అధికారి సీఎం వెంకటేఽశం, హార్టికల్చర్ అధికారి మహేశ్వరి, ఏఓ సురేశ్, హెచ్‌ఈఓ శివలీల, సర్పంచ్ వెంకటయ్య పాల్గొన్నారు.


