పకడ్బందీగా ఇంటర్‌ పరీక్షల నిర్వహణ | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా ఇంటర్‌ పరీక్షల నిర్వహణ

Feb 20 2026 7:01 AM | Updated on Feb 20 2026 7:01 AM

పకడ్బందీగా ఇంటర్‌ పరీక్షల నిర్వహణ

పకడ్బందీగా ఇంటర్‌ పరీక్షల నిర్వహణ

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ యాదయ్య

వనపర్తి: ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలను పకడ్బందీగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ యాదయ్య ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్‌ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు పరీక్షలు కొనసాగనున్నాయని.. విద్యార్థులను తప్పనిసరిగా తనిఖీ చేసి కేంద్రాల్లోకి అనుమతించాలన్నారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చీఫ్‌ సూపరింటెండెంట్లు చూడాలన్నారు. సెల్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలను ఎట్టి పరిస్థితుల్లో పరీక్ష కేంద్రంలోకి అనుమతించొద్దని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ప్రతి హాలులో గోడ గడియారం అమర్చాలని సూచించారు. పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు కొనసాగనున్నందున విద్యార్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకునేలా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లావ్యాప్తంగా 25 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని, మొదటి సంవత్సరం విద్యార్థులు 6,216 మంది.. రెండో సంవత్సరం విద్యార్థులు 6,437 మంది పరీక్షలకు హాజరవుతున్నారని వివరించారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని.. పరీక్ష సమయంలో సమీపంలోని జిరాక్స్‌ సెంటర్లు మూసి ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులకు తాగునీరు, ఫ్యాన్లు, టాయిలెట్స్‌ తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్‌ అధికారి ఎర్ర అంజయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement