
వేరుశనగ సాగుకు ఊతం
ఉచిత విత్తన పంపిణీకి ప్రభుత్వాలు శ్రీకారం
వనపర్తి: దక్షిణాదిలో అత్యధికంగా వేరుశనగ సాగు చేసే ప్రాంతంగా పాలమూరు గుర్తింపు పొందింది. ఇక్కడ సాగుచేసే నాణ్యమైన వేరుశనగకు విదేశీ మార్కెట్‌లోనూ డిమాండ్ ఉన్న విషయం విధితమే. ఏటా రూ.కోట్ల విలువజేసే వంట నూనెలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు పలుమార్లు ప్రభుత్వాలు నివేదికలను వెల్లడించాయి. మన ప్రాంతానికి కావాల్సిన వంట, ఇతర నూనెలను మనమే కావాల్సిన మేర ఉత్పత్తి చేసుకోవాలనే సదుద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నూనెగింజల సాగును ప్రోత్సహించేందుకు రైతులకు వేరుశనగ విత్తనాలను ఉచితంగా పంపిణీ చేసేందుకు నిర్ణయించి జాతీయ నూనెగింజల ఉత్పత్తి పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకానికి రాష్ట్రంలో వేరుశనగ ఎక్కువగా సాగుచేసే ఏడు జిల్లాలను ఎంపిక చేయగా.. అందులో ఐదు జిల్లాలు ఉమ్మడి పాలమూరులోనే ఉండటం గమనార్హం. ఉమ్మడి పాలమూరుతో పాటు వికారాబాద్, నల్గొండ జిల్లాలు ఉన్నాయి. ప్రతి జిల్లాలో మూడు నుంచి నాలుగు మండలాలను ఎంపిక చేసి వేరుశనగ సాగుపై ఆసక్తి కనబర్చే చిన్నా, సన్నకారు రైతులను గుర్తించి ప్రభుత్వం తరుఫున ఎక్కువ నూనెశాతం ఉండే నూతన విత్తనాలను ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయశాఖ శ్రీకారం చుట్టింది. పాలమూరు రైతులకు ఉచిత వేరుశనగ విత్తనాల పంపిణీ తీపి కబురుగానే చెప్పవచ్చు.
ఏటా యాసంగిలోనే సాగు..
జిల్లాలో ఏటా వానాకాలంలో వరి, యాసంగిలో వేరుశనగ సాగు చేయడం కొన్నేళ్లుగా ఇక్కడి రైతులకు అలవాటు. కానీ ఇటీవల సాగునీటి లభ్యత పెరగడం, అడవి పందుల బెడద అధికం కావడంతో అధిక భాగం వానాకాలం, యాసంగిలోనూ వరిసాగు చేయడం ప్రారంభించారు. దీంతో గత నాలుగైదేళ్లలో వేరుశనగ సాగు గణనీయంగా తగ్గిందని చెప్పవచ్చు. 2017–18 యాసంగిలో అత్యధికంగా సుమారు 60 వేల ఎకరాల్లో వేరుశనగ సాగు చేస్తే.. గతేడాది యాసంగిలో 19 వేల ఎకరాల్లో మాత్రమే సాగైనట్లు వ్యవసాయశాఖ గణాంకాలు చెబుతున్నాయి. వరి మాదిరిగా వేరుశనగకు సరైన మార్కెటింగ్ అవకాశాలు కల్పిస్తే.. జిల్లాలో సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉంది.
జిల్లాలో మూడు మండలాలు ఎంపిక..
ఈ పథకానికి జిల్లాలోని పాన్‌గల్, పెద్దమందడి, పెబ్బేరు మండలాలను ఎంపిక చేయగా.. మంగళవారం పెద్దమందడి మండలం బలిజపల్లిలో పలువురు రైతులకు ఇక్రిసాట్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన కదిరి లేపాక్షి, జీజేసీ–32, గిర్నాల్ రకం విత్తనాలు 490 క్వింటాళ్లు పంపిణీ చేశారు. ఆయా రైతులు పండించిన ఉత్పత్తులతో జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాల్లో సీడ్‌హబ్, సీడ్ స్టోరీజీలను ఏర్పాటుచేసి నూనెగింజల ఉత్పత్తిని మరింత పెంచేందుకు వ్యవసాయశాఖ అధికారులు కృషి చేయాల్సి ఉంటుంది. గతంలోనూ.. జిల్లాలోని ఖాసీంనగర్‌లో ఇక్రిసాట్ శాస్త్రవేత్తలు వేరుశనగ విత్తన బండాగారం ఏర్పాటుచేసి అధిక దిగుబడులిచ్చే విత్తనాలతో సత్ఫలితాలు సాధించారు. ప్రభుత్వం దృష్టి సారించకపోవడంతో కాలక్రమేణ రైతులు వేరుశనగ సాగును తగ్గించి వరి సాగుకు ఆసక్తి చూపించారు.
నాలుగు రకాల పంటల సాగు..
జిల్లా రైతులు ఇప్పటి వరకు వేరుశనగతో పాటు నువ్వులు, ఆముదం, సోయాబిన్ వంటి నూనెగింజలు మాత్రమే సాగు చేస్తుండగా.. మొత్తం నూనెగింజల సాగులో వేరుశనగ 90 శాతం ఉంటుంది.
ఏటా భారీ మొత్తంలో వంటనూనెలు దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. ఈ పరిస్థితిని మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నూనెగింజల సాగును ప్రోత్రహించేందుకు పూనుకున్నాయి. మన ప్రాంతానికి కావాల్సిన వంట, ఇతర రకాల నూనెలను మనమే తయారు చేసుకునేందుకు ఆయిల్‌పాంతో పాటు వేరుశనగ సాగును పెంచేందుకే ఉచిత విత్తనాల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. సాధారణ వేరుశనగ కే–6 రకం కంటే ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న వేరుశనగ విత్తన రకాల్లో 50 నుంచి 60 శాతం ఎక్కువ నూనెశాతం ఉంటుంది.
– ఆంజనేయులుగౌడ్,
జిల్లా వ్యవసాయశాఖ అధికారి
రాష్ట్రవ్యాప్తంగా ఏడు జిల్లాలు ఎంపిక.. అందులో ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాలు
జిల్లాలో మూడు మండలాలు ఎంపిక
ఇక్రిసాట్ శాస్త్రవేత్తలు అభివృద్ధి
చేసిన అధిక దిగుబడినిచ్చే విత్తనాలు
అందజేత