
సమర్థవంతంగా విధుల నిర్వహణ : ఎస్పీ
వనపర్తి: విధుల్లో నిబద్ధతతో పాటు ఆరోగ్య పరిరక్షణ అవసరమని, పోలీసులు సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని ఎస్పీ రావుల గిరిధర్ కోరారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయ సమావేశ మందిరంలో అన్ని పోలీస్‌స్టేషన్ల ఏఎస్సైల ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించగా.. ఎస్పీ పాల్గొని విధుల్లో సమర్థత, న్యాయపరమైన దృక్పథం, ప్రజాసేవలో బాధ్యతలపై అవగాహన కల్పించారు. ఏఎస్‌ఐలు పోలీసు వ్యవస్థలో కీలక స్తంభాలని, నిబద్ధత, సమయపాలన, నిజాయితీ పోలీస్‌స్టేషన్ సమర్థతను నిర్ణయిస్తాయన్నారు. క్రైం రిజిస్టర్, ఎఫ్‌ఐఆర్‌లు, పంచనామాలు, సాక్షుల విచారణ వంటి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని, స్టేషన్ నిర్వహణలో ఎస్సైకి సహకరించాలని సూచించారు. ప్రజల భద్రత, న్యాయసేవలో ఆదర్శంగా నిలవాలని, కఠిన కేసులను సవాలుగా స్వీకరించి చాకచక్యంగా పరిష్కరించాలన్నారు. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే విధుల్లో సమర్థత పెరుగుతుందని, నిత్య వ్యాయామం, సమతుల ఆహారం, సానుకూల దృక్పథంతో సేవ కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలో డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వరరావు, డీసీఆర్బీ ఎస్‌ఐ తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.