
డీసీసీ అధ్యక్ష పీఠానికి పోటాపోటీ
వనపర్తి: కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్ష పీఠానికి పోటీ గతంలో ఎన్నడూ లేనివిధంగా పెరిగింది. పార్టీ అధిష్టానం ఈసారి పాత ఎంపిక విధానానికి స్వస్తిపలికి జిల్లాల వారీగా ఏఐసీసీ స్థాయి నాయకులతో పరిశీలన.. నేతలు, కార్యకర్తల అభిప్రాయ సేకరణ చేపట్టి డీసీసీ అధ్యక్ష పీఠం కట్టబెట్టే ప్రయత్నం చేస్తోంది. పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి, ఏఐసీసీ పరిశీలకుడు వి.నారాయణస్వామితో పాటు మాజీ ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్, జొజ్జ సంధ్యారెడ్డి, కోటేశ్వర్‌రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. జి.చిన్నారెడ్డి ఇటీవల జిల్లాలో పర్యటించారు. డీసీసీ అధ్యక్ష పదవి ఆశిస్తున్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరించడంతో పాటు వారితో వ్యక్తిగతంగా మాట్లాడి పార్టీ బలోపేతానికి తీసుకుంటున్న చర్యలు, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై చర్చించారు. అనంతరం జిల్లా ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించి అభిప్రాయ సేకరణ చేశారు. దరఖాస్తు చేసుకున్న వారిలో జిల్లా కేంద్రానికి చెందిన నాయకులు అత్యధికులు ఉండగా.. ఇతర ప్రాంతాలకు చెందిన కొందరు ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాకేంద్రంతో పాటు దేవరకద్ర, మక్తల్ నియోజకవర్గ ప్రాంతాల నాయకులతో రెండ్రోజుల పాటు వేర్వేరుగా సమావేశాలు నిర్వహించి ముఖ్య నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలతో జిల్లా పార్టీ పగ్గాలు ఎవరికి ఇవ్వాలనే విషయంపై సమాలోచనలు చేసినట్లు సమాచారం.
సీఎం ఆశీస్సులున్న వారికేనన్న చర్చ..
జిల్లాకేంద్రానికి చెందిన ఓ ముఖ్య నాయకుడికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మద్దతు ఉందని.. సదరు వ్యక్తికే డీసీసీ అధ్యక్ష పీఠం దక్కే ఛాన్స్ ఎక్కువగా ఉందనే చర్చ స్థానిక కాంగ్రెస్ శ్రేణుల్లో వినిపిస్తోంది. కాగా.. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. జి.చిన్నారెడ్డి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డికి సన్నిహితులుగా ఉన్న నాయకులు పదవి కోసం పోటాపోటీగా దరఖాస్తులు సమర్పించారు. పలువురు నాయకులు గతంలో పార్టీ, ప్రజల కోసం చేసిన సేవా కార్యక్రమాల పేపర్ ప్రతులను సైతం దరఖాస్తుతో పాటు సమర్పించినట్లు తెలుస్తోంది.
డీసీసీ అధ్యక్ష పీఠాన్ని ఆశిస్తూ చేసిన దరఖాస్తులను జిల్లా పరిశీలకులు పీసీసీకి అందజేస్తారు. పీసీసీ స్థాయిలో చర్చించి నాయకులు, కార్యకర్తల్లో ఎక్కువ మంది కోరిన వ్యక్తి.. ఐదేళ్లుగా పార్టీకి చేసిన సేవలు, భవిష్యత్‌లో కలిగే లాభాలను బేరీజు వేసుకొని ఎంపిక చేయనున్నారు. ఈ నెల 22న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల అధ్యక్షుల పేర్లను పీసీసీ ప్రకటించాలని నిర్ణయించినా.. పోటీ ఎక్కువగా ఉన్నందున ఆలస్యం కావచ్చనే చర్చలు పార్టీ క్యాడర్‌లో విపిస్తున్నాయి. డీసీసీ అధ్యక్ష పీఠం ఎవరికి దక్కుతుందో తెలుసుకునేందుకు మరో వారం వేచిచూడక తప్పదు.
ఏఐసీసీ పరిశీలకులకు 16 దరఖాస్తులు