
ధాన్యం కొనుగోలుపై అవగాహన ఉండాలి
వనపర్తి: నాణ్యమైన వరి ధాన్యం సేకరించేలా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా పౌరసరఫరాలశాఖ, సంస్థ ఆధ్వర్యంలో 2025–26 వానాకాలం ధాన్యం కొనుగోలుకు సంబంధించి సన్నాహక సమావేశం నిర్వహించగా.. కలెక్టర్‌తో పాటు డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి, రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ హాజరయ్యారు. ఎఫ్‌ఏక్యూ ప్రమాణాల ప్రకారం నాణ్యమైన ధాన్యాన్ని గుర్తించడంపై ఏఓలు, ఏఈఓలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నాణ్యమైన వరి ధాన్యం గుర్తించేందుకు కేంద్రాల నిర్వాహకులకు సోమ, మంగళవారం శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. నిర్దేశించిన తేమశాతం ఉండేలా, తాలు లేకుండా ధాన్యం కొనుగోలు చేసేలా సూచనలు చేయాలన్నారు. గత సీజన్‌లో రవాణా కాంట్రాక్టర్ల నుంచి ఎదురైన ఇబ్బందులను గుర్తు చేస్తూ ఈసారి అలాంటి పరిస్థితులు తలెత్తొద్దని ఆదేశించారు. కేటాయించిన మిల్లులకే ధాన్యం తరలించాలని, ఈ విషయంలో మిల్లర్లు కూడా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా మిల్లర్లు రైతులను ఇబ్బందులకు గురిచేసే పరిస్థితులు రాకుండా జాగ్రత్త పడాలన్నారు. ధాన్యం మిల్లుకు చేరిన వెంటనే ట్రక్ షీట్లను వాట్సాప్ ద్వారా పంపి రైతులకు వెంటనే నగదు చెల్లించేందుకు కృషి చేయాలని సూచించారు. మిల్లర్లకు ఏవైనా సమస్యలుంటే పరిష్కార మార్గం చూపించడానికి కృషి చేస్తామన్నారు. డీసీసీబీ చైర్మన్ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లలో గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలని తెలిపారు. టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు, క్లీనర్లు సరిపడా అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎట్టి పరిస్థితుల్లో రైతులకు నష్టం వాటిల్లకుండా చూడాలని కోరారు. ధాన్యం కొనుగోలు సజావుగా సాగేలా ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీ విశ్వనాథ్, డీఎం జగన్మోహన్, డీఆర్డీఓ ఉమాదేవి, డీసీఓ రాణి, డీటీఓ మానస, డీఎంఓ స్వరణ్‌సింగ్, వనపర్తి, మదనాపురం మార్కెట్ చైర్మన్లు శ్రీనివాస్‌గౌడ్, ప్రశాంత్, పాక్స్ సీఈవోలు, ఐకేపీ ఏపీఎంలు పాల్గొన్నారు.
ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం పెండింగ్‌లో ఉన్న ఫారం 6, 7, 8 దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరిస్తున్నామని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. గురువారం రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈఓ సుదర్శన్‌రెడ్డి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. జిల్లా నుంచి కలెక్టర్, రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, ఆర్డీఓ సుబ్రమణ్యం పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మృతిచెందిన ఓటర్లను జాబితా నుంచి తొలగించామని తెలిపారు. సమావేశంలో డిప్యూటీ కలెక్టర్లు రంజిత్‌రెడ్డి, శ్రావ్య, తహసీల్దార్ రమేష్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.