
‘పాలమూరు’పై చర్చకు సిద్ధం : ఎమ్మెల్యే
వనపర్తి: బీఆర్‌ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై అవాస్తవాలు మాట్లాడుతున్నారని, నిర్మాణ పనులపై చర్చకు సిద్ధమని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సవాల్ విసిరారు. గురువారం జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు, ఎల్వోసీలను లబ్ధిదారులకు అందజేసి మాట్లాడారు. బీఆర్‌ఎస్ పాలకులు స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని మండిపడ్డారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఓడించారని.. స్థానిక ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్ నేతలను నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పేదల ప్రభుత్వం కొనసాగుతోందని.. నియోజకవర్గంలో విద్యారంగ అభివృద్ధికి రూ.50 కోట్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి రూ.60 కోట్లు మంజూరైనట్లు చెప్పారు. కార్యక్రమంలో వనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, కాంగ్రెస్‌పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీలతరెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌ప్రసాద్, నాయకులు పాల్గొన్నారు.