
ఆగ్రహించిన అన్నదాతలు
● టోకన్లు ఇచ్చి యూరియా ఇవ్వరా అంటూ..
రహదారిపై బైఠాయించి ఆందోళన
● మద్దతు తెలిపిన మాస్‌లైన్,
సీపీఐ నాయకులు
అమరచింత: మండల కేంద్రంలోని ఆగ్రో రైతు సేవాకేంద్రం నిర్వాహకుడు మూడురోజుల కిందట ఇచ్చిన టోకన్లకు గురువారం కూడా యూరియా ఇవ్వకపోవడంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కి రాస్తారోకో చేశారు. విషయం తెలుసుకున్న మాస్‌లైన్, సీపీఐ నాయకులు రైతులకు మద్దతుగా నిలిచి ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా పార్టీలు, రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేనంతగా ప్రస్తుతం యూరియా కొరత ఉందన్నారు. యూరియా పంటలకు సకాలంలో వేయకపోవడంతో ఎదుగుదల లోపించిందని తెలిపారు. టోకన్ల ద్వారా యూరియా సరఫరా చేస్తున్నామని చెప్పడమే తప్పా అంతర్గతంగా బడా రైతులు అధికంగా తీసుకెళ్తున్నారని, అరికట్టే వారు కరువయ్యారన్నారు. మండలంలో ప్రస్తుతం వరితో పాటు చెరుకు సాగు అధికంగా ఉందని.. సకాలంలో అందక తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితులు దాపురించాయని వివరించారు. యూరియా కోసం వచ్చిన మహిళా రైతులు తెచ్చుకున్న ఆహారం అక్కడే తింటూ నిరసన వ్యక్తం చేశారు. అధికారులు వచ్చి న్యాయం చేయాలని, లేనిపక్షంలో ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించుకు కూర్చోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఏఓ అరవింద్ రైతులతో మాట్లాడి యూరియా అందరికి అందిస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. కార్యక్రమంలో మాస్‌లైన్ మండల కార్యదర్శి రాజన్న, డివిజన్ కోశాధికారి రాజు, సీపీఐ మండల కార్యదర్శి అబ్రహం తదితరులు పాల్గొన్నారు.