
ధాన్యం కొనుగోలుకు సన్నద్ధం కావాలి
వనపర్తి: జిల్లాలో 2025–26 వానాకాలం వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించి అక్టోబర్ మొదటి వారంలో కేంద్రాలు ప్రారంభించేందుకు తగిన చర్యలు చేపట్టాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో వరి ధాన్యం కొనుగోలుపై సంబంధిత శాఖల అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సన్న, దొడ్డు రకం మొత్తం 4.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా ఉన్నట్లు తెలిపారు. ఐకేపీ, మెప్మా, పాక్స్ తరఫున ఏర్పాటు చేయబోయే కేంద్రాలపై నివేదిక అందజేయాలని సూచించారు. సన్న, దొడ్డు రకం ధాన్యం కొనుగోలుకు వేర్వేరు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, అన్ని కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా కనీస సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. టెంట్, తాగునీరు, గన్నీ బ్యాగులు, తూకం, తేమ కొలిచే యంత్రాలు, క్యాలిపర్స్, క్లీనర్లు, టార్పాలిన్లు అన్ని కేంద్రాల్లో అందుబాటులో ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. టార్పాలిన్లు, బరువు కొలిచే యంత్రాలు, ఇతర పరికరాలు అదనంగా అవసరం ఉంటే ముందుగానే ఇండెంట్ ఇవ్వాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, ఏఈఓలు, కంప్యూటర్ ఆపరేటర్లు, మిల్లర్లు, ట్రాన్స్‌పోర్టర్లు, కోత యంత్రాల యజమానులతో సమావేశం ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలుకు సంబంధించి శిక్షణ ఇవ్వాలన్నారు. పంట కోతలు మొదలయ్యే నాటికి ధాన్యం కొనుగోలుకు అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలన్నారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి కాశీ విశ్వనాథ్, పౌరసరఫరాలశాఖ డీఎం జగన్మోహన్, డీఆర్డీఓ ఉమాదేవి, డీఏఓ ఆంజనేయులుగౌడ్, మార్కెటింగ్ అధికారి స్వరణ్‌సింగ్, డీసీఓ రాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
రెవెన్యూ అదనపు కలెక్టర్
ఎన్.ఖీమ్యానాయక్