
అప్రమత్తతతోనే విద్యుత్ ప్రమాదాల నియంత్రణ
వనపర్తి: వర్షాకాలంలో ఎక్కువగా విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని.. రైతులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు. పంట పొలాల్లో విద్యుత్ ప్రమాదాల నివారణపై గురువారం జిల్లా పోలీసు కార్యాలయం నుంచి జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్ల ఎస్‌ఐలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. జిల్లాలో ఈ ఏడాది 11 మంది రైతులు విద్యుదాఘాతానికి గురై మృతి చెందారన్నారు. రైతులు వర్షాకాలంలో తడిగా ఉండటం గమనించక మోటార్లు, విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను తాకడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని వివరించారు. యజమాని మృతిచెందితే ఆ కుటుంబం రోడ్డున పడుతోందని.. రైతులు విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా నివారించేందుకు గ్రామాల్లో విధిగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో స్పెషల్ బ్రాంచి సీఐ నరేష్, డీసీఆర్బీ ఎస్‌ఐ తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.