కృష్ణాతీరానికి సొబగులు | - | Sakshi
Sakshi News home page

కృష్ణాతీరానికి సొబగులు

Sep 19 2025 1:40 AM | Updated on Sep 19 2025 1:40 AM

కృష్ణాతీరానికి సొబగులు

కృష్ణాతీరానికి సొబగులు

కొల్లాపూర్‌: ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కృష్ణానది తీరంలో పర్యాటకానికి మహర్దశ పట్టింది. ఇప్పటికే సోమశిల పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతుండగా.. కృష్ణానది తీరం వెంట ఉండే ఇతర ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చర్యలు చేపట్టాయి. అందులో భాగంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నాయి.

నిధుల కేటాయింపు..

వెల్‌నెస్‌ అండ్‌ స్పిరిచ్యువల్‌ రిట్రీట్‌ ప్రాజెక్టులో భాగంగా కొల్లాపూర్‌ మండలం అమరగిరిలో పర్యాటక అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఇటీవలే ప్రభుత్వం రూ.45.84 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో అమరగిరి సమీపంలోని మల్లయ్య సెల, నడింతిప్ప ప్రాంతాల్లో కృష్ణానది మధ్యలో గల దీవిలో పర్యాటకులను ఆకట్టుకునేలా నిర్మాణాలు చేపట్టబోతున్నారు. ఇక్కడ యోగా డెక్‌, పెవిలియన్‌, స్పా ఏరియా, కాటేజీలు, సిబ్బంది వసతి గృహాలు, స్విమ్మింగ్‌పూల్‌, ఇండోర్‌, అవుట్‌ డోర్‌ యాక్టివిటీస్‌, వ్యూయింగ్‌ డెక్‌, స్టోర్‌ రూంలు, బోట్లు నిలిపేందుకు జెట్టీలు, వివిధ రకాల చెట్లతో గార్డెనింగ్‌ వంటి పనులు సుందరంగా చేపట్టనున్నారు. అదేవిధంగా సోమశిలలో వీఐపీ ఘాట్‌కు పర్యాటకుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో రూ.1.60 కోట్లతో ఘాట్‌ విస్తరణ, బోటింగ్‌ వసతులు మెరుగుపర్చే పనులు చేపట్టనున్నారు. ఈ పనులకు ఇటీవలే రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేశారు.

కన్సల్టెన్సీలతో సంప్రదింపులు..

పర్యాటక అభివృద్ధి పనులు చేపట్టేందుకు పలు కన్సల్టెన్సీలు ముందుకు వస్తున్నాయి. హైదరాబాద్‌తోపాటు ఇతర నగరాలకు చెందిన పలు కంపెనీల ప్రతినిధులు పర్యాటక శాఖ అధికారులను సంప్రదించారు. ఆకట్టుకునే విధంగా నిర్మాణాలు చేపట్టే వారికే ఈ పనులు అప్పగించాలనే యోచనలో అధికారులు ఉన్నారు. అయితే కొన్ని రోజులుగా కన్సల్టెన్సీల ప్రతినిధులు అమరగిరి ప్రాంతాన్ని సందర్శిస్తున్నారు.

హెలీ టూరిజంతో ప్రాముఖ్యత..

సోమశిల నుంచి శ్రీశైలం వరకు హెలీ టూరిజం ప్రారంభిస్తామని ఇటీవల రాష్ట్ర పర్యాటకశాఖ ప్రకటించింది. దీంతో ఈ ప్రాంతం మరోసారి వార్తల్లోకెక్కింది. నల్లమల అడవి, కృష్ణానది అందాలు తిలకిస్తూ సాగే హెలీ టూరిజంపై పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే నదిలో లాంచీ ప్రయాణం ఏర్పాటు చేయగా..హెలీ టూరిజం ఏర్పాటుతో జాతీయస్థాయి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.

రహదారుల నిర్మాణం..

కొల్లాపూర్‌ నియోజకవర్గంలో పర్యాటక ప్రాంతాలు అనేకం ఉన్నాయి. వీటిలో సోమశిల, అమరగిరి, మంచాలకట్ట, జటప్రోల్‌, సింగోటం వంటి ప్రాంతాలకు పర్యాటకులు అధికంగా వస్తున్నారు. అమరగిరిలో పెద్దఎత్తున పర్యాటక అభివృద్ధి పనులు చేపట్టనున్న నేపథ్యంలో ఆ గ్రామానికి వెళ్లే రహదారిని బాగుచేసేందుకు చర్యలు ప్రారంభించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.2.80 కోట్లతో అమరగిరికి వెళ్లే రోడ్డు నిర్మాణానికి మంత్రి జూపల్లి కృష్ణారావు భూమిపూజ చేశారు. రోడ్డు వెంట ఉన్న కల్వర్టుల నిర్మాణాలు పూర్తయ్యాయి. బీటీ నిర్మించాల్సి ఉంది. అలాగే పెంట్లవెల్లి నుంచి మంచాలకట్టకు వెళ్లే రోడ్డును కూడా బాగుచేసేందుకు రూ.1.40 కోట్లు కేటాయించారు. రహదారులు, పర్యాటక అభివృద్ధి పనులు పూర్తయితే కొల్లాపూర్‌ పర్యాటకంగా మరింతంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి.

సోమశిలలోని వీఐపీ ఘాట్‌ సమీపంలో నిలిపిన పర్యాటక బోట్లు

పనుల అప్పగింతపై చర్చలు..

సోమశిల, అమరగిరిలో పర్యాటక అభివృద్ధి పనులు కన్సల్టెన్సీలకు అప్పగించనున్నారు. ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. కొల్లాపూర్‌ను పర్యాటకంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నారు. అమరగిరిలో విదేశీ పర్యాటకులను ఆకట్టుకునేలా నిర్మాణాలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు అందాయి. కృష్ణానది తీరం వెంట ఉండే పర్యాటక ప్రాంతాల్లో బోటింగ్‌ సౌకర్యాన్ని మరింత మెరుగుపర్చేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నాం.

– నర్సింహ, జిల్లా పర్యాటకశాఖ అధికారి, నాగర్‌కర్నూల్‌

కృష్ణానది పరివాహకంలో పర్యాటకం అభివృద్ధికి నిధులు

అమరగిరి, సోమశిలలో

వసతుల కల్పనకు చర్యలు

నిర్మాణ పనులు చేపట్టేందుకు

ఆసక్తి చూపుతున్న కన్సల్టెన్సీలు

పర్యాటక గ్రామాలకు వెళ్లే

రహదారుల ఏర్పాటుకు శ్రీకారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement