పర్యావరణ పరిరక్షణ.. విద్యార్థుల బాధ్యత | - | Sakshi
Sakshi News home page

పర్యావరణ పరిరక్షణ.. విద్యార్థుల బాధ్యత

Feb 8 2024 12:16 AM | Updated on Feb 8 2024 12:16 AM

- - Sakshi

వనపర్తిటౌన్‌: పర్యావరణ పరిరక్షణలో విద్యార్థుల పాత్ర కీలకమని ఎన్జీసీ మేనేజర్‌ శివకిరణ్‌ అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో అడవులు, వాతావరణ మార్పులశాఖ భారత ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర జాతీయ హరితదళం (టీఎస్‌ ఎన్జీసీ) విద్యాశాఖ సమన్వయంతో ‘సుస్థిర జీవన విధానం’ అనే అంశంపై జిల్లా ఎన్జీసీ కో–ఆర్డినేటర్‌ ఐ.సుదర్శన్‌రావు ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి వర్క్‌షాప్‌కు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా పర్యావరణ అంశాలను ప్రయోగాత్మకంగా వివరించి పరిశుభ్రత ప్రాముఖ్యత, తడి, పొడి చెత్త వేరుచేసే విధానాన్ని వివరించారు. ప్లాసిక్‌ భూమిలో విచ్ఛినం కాకుండా పరిసరాలను ఎలా కలుషితం చేస్తుందో తెలియజేశారు. ఉదయాన్నే నిద్ర లేవడం, వ్యాయామం, యోగా చేయడం, చేతిసంచుల వినియోగం, ఆహారంలో పండ్లు, కూరగాయలు తీసుకోవడం, పరిసరాలను హరితయుతంగా మార్చడం, నీటిని పొదుపుగా వినియోగించడం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం డీఈఓ గోవిందరాజులు మాట్లాడుతూ.. నిత్య జీవితంలో ప్లాస్టిక్‌ను ఎక్కువగా వాడటంతోనే వాతావరణం కలుషితం అవుతుందని తెలిపారు. వాటి అవశేషాలు ఆహారపు గొలుసుతో శరీరంలోకి ప్రవేశించి క్యాన్సర్‌, ప్రమాదకర వ్యాధుల బారిన పడుతారని చెప్పారు. పర్యావరణ ప్రాముఖ్యతను తెలుసుకోవాలని సూచించారు. మెజీషియన్‌ పూర్ణచందర్‌ తన ప్రదర్శనలతో విద్యార్థులను ఆకట్టుకున్నారు. అనంతరం చేతి సంచులను విద్యార్థులకు అందజేశారు.

సమస్యల పరిష్కారానికి పోరాటం

అమరచింత: జిల్లాలోని గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి సీపీఐ ఆధ్వర్యంలో ప్రజల పక్షాన పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని సీపీఐ జిల్లా కార్యదర్శి విజయరాములు అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని అంబేడ్కర్‌ భవన్‌లో నిర్వహించిన మండల ముఖ్య నాయకుల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై స్థానిక సమస్యల గురించి చర్చించారు. అనంతరం మాట్లాడుతూ.. పట్టణంలో దీర్ఘకాలంగా ఉన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. పుర పాలకవర్గం ప్రజా సమస్యలను విస్మరించిందని.. కాల్వల్లో మురుగు పేరుకుపోయినా తొలగించడం లేదని తెలిపారు. సీసీ రహదారులు, మరుగుదొడ్లు, విద్యుత్‌ తీగలు, ఇళ్లు, ఇళ్లస్థలాలు, రేషన్‌ కార్డులు అర్హులైన ప్రతి ఒక్కరికి అందించేందుకు కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అదేవిధంగా ఈ నెల 16న చేపట్టే గ్రామీణబంద్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ నెల 21, 22న కొంకన్వానిపల్లెలో మక్తల్‌ నియోజకవర్గస్థాయి రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సీపీఐ మండల, పట్టణ కార్యదర్శులు అబ్రహం, భాస్కర్‌, నాయకులు శ్యాంసుందర్‌, కుమార్‌, గీతమ్మ, రవీందర్‌, ఇజ్రాయిల్‌, సౌలు, కతలప్ప, నిస్సార్‌ పాల్గొన్నారు.

బీడీ పరిశ్రమ రక్షణకు ఉద్యమిద్దాం

ఆత్మకూర్‌: దేశవ్యాప్తంగా బీడీ పరిశ్రమలపై ఆధారపడి కోట్లాది మంది కార్మికులు జీవిస్తున్నారని.. ఈ పరిశ్రమలను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు పూనుతోందని తెలంగాణ ప్రగతిశీల బీడీ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి అరుణ్‌కుమార్‌ ఆరోపించారు. బుధవారం మండలంలోని మూలమళ్లలో జరిగిన ఇఫ్టూ సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ నెల 16న దేశవ్యాప్తంగా చేపట్టే సార్వత్రిక సమ్మెలో కార్మికులు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సామేలు, దేవ రాజు, మాణిక్యమ్మ, వెంకటన్న, సువర్ణ, బేబీ, లక్ష్మీప్రసన్న, సవరమ్మ, కృష్ణయ్య పాల్గొన్నారు.

కంది క్వింటా రూ.10,183

జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌ యార్డులో బుధవారం కంది క్వింటా గరిష్టంగా రూ.10,183, కనిష్టంగా రూ.9,840 ధర లభించింది. ఈ సీజన్‌లో ఇంత ధర లభించడం ఇదే మొదటిసారని యార్డు అధికారులు తెలిపారు. అలాగే వేరుశనగ రూ.7,276–రూ.4,390, వరి ఆర్‌ఎన్‌ఆర్‌ రకానికి రూ.3,168, మొక్కజొన్న రూ.1,952, పత్తి గరిష్టంగా రూ.6,429, కనిష్టంగా రూ.5,179, జొన్నలు గరిష్టంగా రూ.5,754, కనిష్టంగా రూ.2,010, పెబ్బర్లు రూ.7,416, మినుములు రూ.9,139, ఉలువలు రూ.7,267 చొప్పున పలికాయి.

1
1/1

Advertisement
 
Advertisement
Advertisement