● మార్కెట్‌లో భలే గిరాకీ
● భారీగా క్రయవిక్రయాలు
● పండులో పోషకాలు బోలెడు
సీతంపేట: ఈ సీజన్‌లో నోరూరించే, ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నోరకాల పండ్లు మార్కెట్‌లోకి వస్తాయి. వాటిలో పనస ఒకటి ఆరోగ్యకరమని వైద్యనిపుణులు తెలియజేస్తున్నారు. సువాసనలు వెదజల్లడమే కాకుండా రుచిలో ఆమృతాన్ని తలపిస్తుందంటే అతిశయోక్తి కాదు. ఒడిశాతో పాటు ఇతర జిల్లాలకు చెందిన వ్యాపారులు సీతంపేట ఏజెన్సీకి వచ్చి విస్తృతంగా పనసను కొనుగోలు చేస్తారు. వారపు సంతలకు వచ్చి గిరిజనుల నుంచి కొనుగోలు చేస్తారు. ఒక్కొక్కటి రూ.50 నుంచి రూ.100 వరకు రకాన్ని బట్టి గిరిజనులు విక్రయాలు జరుపుతారు. మైదాన ప్రాంతాల్లో రూ.200లు పైబడే విక్రయాలు జరుపుతారు. నవంబర్, డిసెంబర్‌లో పనసకాయల రూపంలో ఎక్కువగా లభిస్తాయి. వాటిని వివిధ హోటల్స్, శుభకార్యాలలో బిర్యానీ కోసం వినియోగించే వారు.
నోరూరించే రుచికరమైన పనస తోనలు
కాండం నుంచి నేరుగా..
పనస మొక్క కాండం నుంచి నేరుగా కాయ కాస్తుంది. చెట్టు మొదలు నుంచి చివరి వరకు ఎక్కడి నుంచైనా కాయలు కాయడం ఈ ఫలం ప్రత్యేకం. ఏప్రిల్ నుంచి జూలై వరకు పనస చెట్లకు బరువైన కాయలు వేలాడుతూ కనిపిస్తాయి. ఒక్కో చెట్టుకు 100 నుంచి 150 కాయల దిగుబడి వస్తుంది. ఒక్కో కాయ పది నుంచి 20 కిలోల బరువుంటుంది. ఈ కాయ ఎంత బరువున్నా ఆందులో 30 శాతం మాత్రమే తినడానికి ఉపయోగపడతాయి. కొండపోడులో ఎక్కువగా చెట్లు కనిపిస్తుంటాయి. అలాగే పెరటి తోటల్లో కూడా వాటిని వేస్తారు.
పనసలో రకాలు..
బంగారు పనస, కొబ్బరి పనస, ఖర్జూర పనస, వేరు పనస, చిన్నకోల పనస, గుండ్రు పనస, గూలాబీ పనస, కజ్జా పనస, బురద పనస ఆనే రకాలు ఉన్నాయి. ఇక్కడ ఖర్జూర, బురద పనసలు లభిస్తాయి. పనస తొనలనే కాదు..పిక్కలను కాల్చుకుని కూరగా వండుకుని తింటుంటారు. ఏజెన్సీలో సహజసిద్ధంగా వండే పనస తొన పలుచగా ఉన్నా రుచి ఆమోఘం. పనసపట్టు కూర అందరూ ఇష్టంగా తింటారు. పనస కాయ ముక్కలతో బిర్యానీ చేస్తే మటన్ ధమ్‌ను మరిపిస్తుందని కొంతమంది వంట నిపుణులు తెలియజేస్తున్నారు.
పనసలో పోషకాలు..
పనసకాయలో ఉండే పోషకాలు చాలా విలువైనవి, సీజన్‌లో దొరికే పండ్లను కచ్చితంగా తినాలని వైద్యులు పేర్కొంటున్నారు. మాంసకృత్తులు 1.2 శాతం, చక్కెర 13.8 శాతం, కొవ్వులు 0.1శాతం, కెరోటిన్ 175 మైక్రోగ్రాములు, రియోమిన్ 0.3 మిల్లీ గ్రాములు, విటమిన్ సి ఏడు మిల్లీ గ్రాములు, పీచు పదార్థాలు 1.1 శాతం, సున్నం 20.0 మిల్లీ గ్రాములు, ఇనుము 0.5 మిల్లీ గ్రాములు లభిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఎంతో మేలు..
పనస పండు శరీర పుష్టిని కలిగించి రక్తాన్ని వృద్ధి చేస్తుంది. మెదడుకు, నరాలకు, కండరాలకు బలాన్ని చేకూరుస్తుంది. బాగా ముగ్గిన పండు మనోల్లాసాన్ని కలిగిస్తుంది. మూత్రాన్ని బాగా జారీ చేసి వాతాన్ని, పైత్యాన్ని నివారిస్తుందని వైద్యులు చెబుతున్నారు. పనస తొనలను నూనె, తేనెలలో ముంచి తింటే జీర్ణం సులభంగా ఆవుతుందని పెద్దల నానుడి.


