ఏ ప్రభుత్వమైనా ప్రజలకు అవసరమైన సదుపాయాల కల్పనకు కృషిచేస్తుంది. అభివృద్ధికి పాటుపడుతుంది. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జనాన్ని ఎలా ఇబ్బందులకు గురిచేయాలన్నదే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. గత ప్రభుత్వం అమలుచేసిన పలు సంక్షేమ పథకాలకు మంగళం పాడేయడమే కాదు.. రోగులకు అందుతున్న సేవలకూ కత్తెర వేస్తోంది. ఆరోగ్యశ్రీ రోగులకు చికిత్స అనంతరం అందించే ఆసరా పథకాన్ని ఎత్తేసింది. ప్రభుత్వాస్పత్రుల్లోని ల్యాబ్‌లను సైతం కుదించి ప్రైవేటు ‘పరీక్ష’లను ప్రోత్సహిస్తోంది. సర్వజన ఆస్పత్రిలోని ఐడీఎస్‌పీ ల్యాబ్‌ను రాజాం ఏరియా ఆస్పత్రికి తరలించేందుకు రంగం సిద్ధం చేయడంపై రోగులు, వారి బంధువులు మండిపడుతున్నారు. ఇక్కడ వేలాది మందికి సేవలందించే ల్యాబ్‌ను ఎలా తరలిస్తారని ప్రశ్నిస్తున్నారు.
విజయనగరం ఫోర్ట్:
జిల్లాలోని ప్రజలకు ఏ ఆరోగ్య సమస్య వచ్చినా ఆశ్రయించేది విజయనగరంలోని సర్వజన ఆస్పత్రినే. ఇక్కడ ప్రతిరోజు వెయ్యికి పైబడి ఓపీ నమోదవుతుంది. ప్రభుత్వ వైద్యకళాశాలకు అనుబంధంగా ఉన్న ఆస్పత్రి కావడంతో మెరుగైన వైద్యసేవలు అందుతాయన్న ఆశతో రోగులు ఆశ్రయిస్తారు. అయితే, చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు రోగులను కలవరపెడుతున్నాయి. ఇప్పటికే ఆస్పత్రిలో బీపీ, సుగర్, కేన్సర్ వంటి రోగులకు చికిత్స అందించే అసంక్రమణ వ్యాధుల నియంత్రణ క్లినిక్ (ఎన్‌సీడీ)ను ఎత్తేశారు. తాజాగా ప్రజలకు వచ్చే ప్రధాన వ్యాధుల నిర్ధారణ పరీక్షలకు ఆధారమైన ఇంటిగ్రేటేడ్ డిసీజ్ సర్వెలెన్స్(ఐడీఎస్‌సీ) ల్యాబ్‌ను సైతం సర్వజన ఆస్పత్రినుంచి తరలించేందుకు సర్వం సిద్ధం చేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
ఐడీఎస్‌పీ ల్యాబ్‌లో చేసే వైద్య పరీక్షలు ఇలా..
ఐడీఎస్‌పీ ల్యాబ్‌లో మలేరియా, డెంగీ, చికెన్‌గున్యా, స్క్రబ్ టైఫస్, హెపటైటీస్–ఏ, హెపటైటీస్–ఇల్పెటోపైరోసిస్ వ్యాధులకు సంబంధించిన పరీక్షలు చేస్తారు. బోధనానుబంధ ఆస్పత్రి కావడంతో అధిక సంఖ్యలో రోగులు తరలివస్తారు. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల నుంచి రిఫర్ కేసులు కూడా అధికంగా ఉంటాయి. ఇక్కడ ఏడాదికి 10వేల పైబడి పరీక్షలు జరుగుతున్నాయి. ఇంతటి ప్రాధాన్యమున్న ల్యాబ్‌ను ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి నుంచి రాజాం ఏరియా ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సర్వజన ఆస్పత్రిలోని ఐడీఎస్‌పీ ల్యాబ్ తరలింపునకు సన్నాహాలు
వైద్య పరీక్షలకు ఇబ్బందులు తప్పవంటున్న రోగులు
ఇదెక్కడి తీరు ‘బాబూ’ అంటూ నిట్టూర్పు
సర్వజన ఆస్పత్రిని కాదని రాజాం తరలించడంపై విమర్శలు
అవసరమైతే అక్కడ కొత్తల్యాబ్ ఏర్పాటుచేయాలని డిమాండ్
ల్యాబ్ తరలింపునకు ఆదేశాలు వచ్చాయి
సర్వజన ఆస్పత్రిలోని ఐడీఎస్‌పీ ల్యాబ్‌ను రాజాం ఏరియా ఆస్పత్రికి తరలించాలని వైద్యారోగ్యశాఖ కమిషనర్ నుంచి ఆదేశాలు వచ్చాయి. ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నాం.
– డాక్టర్ ఎస్.జీవనరాణి, డీఎంహెచ్‌ఓ


